calender_icon.png 13 September, 2025 | 10:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవితంలో విజయం సాధించడానికి విద్యనే కీలకం

13-09-2025 08:50:38 PM

అన్ని రంగాల్లో మహబూబ్ నగర్ ఫస్ట్ గా నిలవాలి

వెల్ఫేర్ ఫండ్ కు తన వంతుగా 10 లక్షలు విరాళం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ఎవరైనా తమ జీవితంలో విజయం సాధించడానికి విద్యనే కీలకమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ - తెలంగాణ రికగ్నిషన్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ట్రెస్మా ఆధ్వర్యంలో నగరంలోని ఎఎస్ఎన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన ఆచార్య దేవోభవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రైవేటు విద్యాసంస్థల ఉత్తమ కరస్పాండెంట్లకు ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేసి, ఘనంగా సన్మానించి, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 65% విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం కల్పిస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలను కాపాడుకోవల్సిన బాధ్యత మనందరిపైన ఉందని, మీ సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కారిస్తామని చెప్పారు. 

మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా అభివృద్ధి చేయాలనే సంకల్పం  రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు తనకు ఉందన్నారు. అందుకే అన్నింట్లో వెనుకబడి లేబర్ జిల్లాగా, వలసల జిల్లాగా పేరుగాంచిన ఈ జిల్లాలో అనతికాలంలోనే పాలమూరు  యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మరియు లా కళాశాలను, ప్రతిష్టాత్మకమైన ఐఐఐటి కళాశాలను, ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలను తీసుకుని వచ్చామని ఆయన గుర్తు చేశారు.  రానున్న  పది సంవత్సరాల్లో సుమారు 10 వేల మంది విద్యార్థుల వరకు ఇంజనీరింగ్ పూర్తి చేసుకునే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభించాలంటే కొత్తగా ఉపాధి అవకాశాలు కల్పించే కంపెనీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మన రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి కంపెనీలు ఏర్పాటు చేయడానికి వచ్చినా , ముందుగా మహబూబ్ నగర్ జిల్లా చుట్టుపక్కల ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నా మన్నారు. 

ఆరోగ్య భీమా అవసరం... 

ఆరోగ్య భీమా ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం ఉందన్నారు. ఆపదలో మిమ్మల్ని ఆదకోనేందు ఉద్దేశించి, ఆరోగ్య సమస్యలకు పరిష్కారించేందుకు ప్రైవేటు స్కూల్ వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ప్రతి నెలా రూ 250 లను చెల్లించాలని, అంతే మొత్తంలో ఆయా పాఠశాల యాజమాన్యం కూడా చెల్లించాలని సూచించారు.  ఆపత్కాలంలో ఈ వెల్ఫేర్ ఫండ్ మిమ్మల్ని రక్షిస్తుందన్నారు.  ఈ మొత్తం కూడా రానున్న ఐదు సంవత్సరాల కాలంలో మన మహబూబ్ నగర్ జిల్లా ప్రైవేటు స్కూల్స్ ఉపాధ్యాయులు, మరియు వారి మేనేజ్మెంట్ కలిసి సుమారు 13 కోట్లు రూపాయలు వెల్ఫేర్ ఫండ్ తయారు అవుతుంది అని ఆయన చెప్పారు.  మహబూబ్ నగర్ ట్రస్మా వెల్ఫేర్ ఫండ్ కు 10 లక్షల రూపాయలను  అందజేస్తానని హామి ఇచ్చారు.  ఈ కార్యక్రమం రాష్ట్రం మొత్తం విస్తరించేందుకు ట్రస్మా ప్రయత్నం చేయాలన్నారు. తెలంగాణ హక్కుల కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆయన స్పష్టం చేశారు.

మహబూబ్ నగర్ లోకి  కార్పోరేట్ విద్యా సంస్థల ప్రవేశం లేదన్నారు. మహబూబ్ నగర్ జిల్లా లోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు విద్యా మహోత్సవం ఏర్పాటు చేసుకుందామని ఆయన సూచించారు.  మన ముఖ్యమంత్రి మనకు ఒక లక్ష్యం కేటాయించారని ఆ లక్ష్యం మన మహబూబ్ నగర్ జిల్లా లో చదువుతున్న  ప్రతి పాఠశాల నుంచి కనీసం ఇద్దరు లేదా ముగ్గురు  మన మహబూబ్ నగర్ పిల్లలే ఐఐఐటి మహబూబ్ నగర్ కళాశాలలో సీటు సంపాదించే విధంగా మనం లక్ష్యం చేరుకోవాలని సమిష్టి బాధ్యత తీసుకొని విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో టి పిసిసి అధికార ప్రతినిధి హర్షవర్దన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు ఎస్ మధుసూదన్,  అధ్యక్షులు ఎస్ శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.క్రాంతి కుమార్, జిల్లా అధ్యక్షులు బి.లక్ష్మణ్, పట్టణ అధ్యక్షులు జి.వంశీ మోహన్, కిరణ్మై , రిషి విద్యాసంస్థల డైరెక్టర్ చంద్రకళా వెంకటయ్య, లుంబిని లక్ష్మణ్ గౌడ్, విజేత డైరెక్టర్ వెంకట్ రెడ్డి, అక్షర విజయ్ కుమార్, ప్రైవేటు విద్యాసంస్థల కరస్పాండెంట్లు, జలజం రమేష్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.