13-09-2025 07:32:51 PM
పచ్చ ధనం పేరుతో ప్రజా ధనం రూ.లక్షలు వృధా
ఇల్లెందు,(విజయక్రాంతి): పచ్చ ధనం పేరుతో పట్టణం మొత్తం రహదారికి ఇరు పక్కల మొక్కలు నాటారు. ఇప్పుడు విద్యుత్ తీగలకు అడ్డు వస్తున్నాయంటూ మానులను నరికేస్తున్నారు. దీనితో ప్రజాధనం రూ. లక్షలు వృధా అయ్యాయనే చెప్పడానికి ప్రత్యక్ష్య సాక్షమిదే. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో గత పాలకవర్గం ఆధ్వర్యంలో హరితహారం పేరుతొ పట్టణం మొత్తం రూ. లక్షలు ఖర్చు చేసి లక్షలాది మొక్కలు నాటారు. అవి ఇప్పుడు మానులై విద్యుత్ తీగలకు అడ్డు వస్తున్నాయని మొదటికి నరికేస్తున్నారు. అప్పుడే మొక్కలు నాటే సమయంలో అవి పెరిగితే విద్యుత్ తీగలగలకు అడ్డువస్తాయని గుర్తించి మరో చోట నాటితే ఉపయోగంలోకి వచ్చేవని పట్టణ ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.
అప్పుడు మొక్కలు నాటేందుకు, ఇప్పుడు మళ్ళీ నరికేందుకు అనవసరంగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. మొక్క నాటేముందు ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. అదే ఒక చెట్టును వేరే వారు నరికితే చర్యలు తీసుకునే వారు ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇల్లందు పట్టణంలో శనివారం కొత్త బస్టాండ్ నుంచి గోవింద్ సెంటర్ వరకు రోడ్డుకు ఇరుపక్కల ఏపుగా ఎదిగిన చెట్లను మున్సిపాలిటీ సిబ్బంది మొదటికి నరికి వేస్తుండటంతో అధికారుల ఆలోచనలకు అర్ధమేంటని అంటున్నారు. ఇకనైనా ఏవైనా అభివృద్ధి పనులు చేపట్టే ముందు కాస్త ఆలోచించండంటూ వ్యాఖ్యానిస్తున్నారు.