22 April, 2026 | 5:07 AM

తెలంగాణలో బీజేపీకి అత్యధిక స్థానాలు ఖాయం

09-05-2024 03:06 AM

చాయ్‌పే చర్చాలో రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ 

రాజేంద్రనగర్, మే 8 (విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి అత్యధిక స్థానాలు రావడం ఖాయమని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని గగన్‌పహాడ్‌లో చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రవాసీ సమ్మేళన్ పేరిట నిర్వహించిన చాయ్‌పే చర్చ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. శేరిలింగంపల్లి, మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గాల పరిధిలో నివసించే ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు, వ్యాపారులు, ఉద్యోగులతో ఆయన చర్చించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ సత్తా చాటుతుందని అన్నారు. ప్రధాని మోదీ హిందూ ధర్మ పరిరక్షణ కోసం తీసుకున్న చర్యలతో దేశం సుభిక్షంగా ఉందని వ్యాఖ్యానించారు. చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాజస్థాన్‌కు చెందిన మాజీ రాజ్యసభ సభ్యుడు, చీఫ్ విప్ నారాయణ్ లాల్ పంచారియా, రాజస్థాన్‌లోని అహోర్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఛగన్‌సింగ్ రాజ్ఫుతోహి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.