బీజేపీకి 12 స్థానాల్లో గెలుపు ఖాయం
రేవంత్ అజ్ఞానానికి మూల్యం చెల్లించుకోక తప్పదు
మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 13 (విజయక్రాతి) ః రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 12 స్థానాలకు పైగానే విజయం సాధిస్తుందని ఆ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం శామీర్‌పేటలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి మాట్లాతున్నారని, ఆయన అజ్ఞానానికి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందనే ఫ్రస్టేషన్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఆక్షేపణీయం అన్నారు. మోదీ ప్రధాని అయితే, దేశం విచ్ఛిన్నం అవుతుందని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. గత ఎన్నికల్లో ఇలాంటి అసత్య ప్రచారమే చేసినా ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మలేదన్నారు. మళ్లీ అరిగిపోయిన రికార్డులా అదే మాట మాట్లాడటం రేవంత్ రెడ్డి అజ్ఞానానికి నిదర్శనం అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డి రాబోయే కాలంలో మూల్యం చెల్లించక తప్పదన్నారు.




