మెదక్‌లో 73.63 శాతం
మందకొడిగా సాగి పెరిగిన పోలింగ్
తలెత్తిన చిన్నపాటి సాంకేతిక సమస్యలు
కొన్నిచోట్ల మొరాయించిన ఈవీఎంలు
మెదక్/ సిద్దిపేట, మే 13 (విజయక్రాంతి) : మెదక్ పార్లమెంట్ స్థానానికి సోమవారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మెదక్ జిల్లాలో ఉదయం 6గంటల నుంచి 7గంటల వరకు ఆయా పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ నిర్వహించారు. అనంతరం 7గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు గాను 18,28,210మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గంలో 2124 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం కొంత మందకొడిగా పోలింగ్ కొనసాగినా తర్వాత పుంజుకుంది. కొన్నిచోట్ల ఈవీఎలు కొద్దిసేపు మొరాయించినా అధికారులు సత్వరమే చర్యలు తీసుకున్నారు. చిన్నచిన్న సాంకేతిక సమస్యలు మినహాయిస్తే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.
కాగా సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో కొద్దిసేపు ఈవీఎంలు మొరాయించినా సరిదిద్దారు. నర్సాపూర్ పట్టణంలోని 284,286 పోలింగ్ బూత్‌లో గంటపాటు ఈవీఎంలు పని చేయలేదు. నియోజకవర్గం పరిధిలో ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సజావుగా ఎన్నికలు ముగిశాయి. ఇది ఇలావుండగా మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్‌రాజ్ దంపతులు హవేళీఘణపూర్ మండలం ఔరంగాబాద్ ప్రాథమిక పాఠశాల 211 పోలింగ్ స్టేషన్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ దంపతులు చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లిలో ఓటు వేశారు. అలా గే మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి కుటుంబీకులు రామాయంపేట మండలం కల్వకుంట గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మెదక్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పోలింగ్ సరళిని పరిశీలిస్తే.. ఉదయం 9గంటల వరకు దుబ్బాకలో 13.0 6, గజ్వేల్‌లో 11.12, మెదక్‌లో 12, నర్సాపూర్‌లో 12.24, పటాన్‌చెరులో 9.15, సంగారెడ్డిలో 10.14, సిద్దిపేటలో 11.10 శాతం పోలింగ్ జరిగింది. ఉదయం 9గంటలకు సిద్దిపేటలో 26.53శాతం, మెదక్‌లో 32.54, నర్సాపూర్‌లో 32.51, సంగారెడ్డిలో 26.40, పటాన్‌చెరులో 23.97, దుబ్బాకలో 30.45, గజ్వేల్‌లో 29.65 శాతం నమోదు కాగా మొత్తంగా 28.30శాతం నమోదైంది. మధ్యాహ్నం ఒంటి గంటకు సిద్దిపేటలో 44.36, మెదక్‌లో 53.17, నర్సాపూర్‌లో 53.75, సంగారెడ్డిలో 44.25, పటాన్‌చెరులో 38.61, దుబ్బాకలో 50.38, గజ్వేల్‌లో 49.57 శాతం నమోదు కాగా మొత్తంగా 46.72శాతం నమోదైంది.
అలాగే మధ్యాహ్నం 3 గంటల వరకు సిద్దిపేటలో 58.63, మెదక్‌లో 57.60, నర్సాపూర్‌లో 70.12, సంగారెడ్డిలో 58.31, పటాన్‌చెరులో 49.44, దుబ్బాకలో 67.17, గజ్వేల్‌లో 65.13 శాతం నమోదు కాగా 60.94శాతం పోలింగ్ జరిగింది. సాయంత్రం 5గంటల వరకు సిద్దిపేటలో 69.25, మెదక్‌లో 76.82, నర్సాపూర్‌లో 81.15, సంగారెడ్డిలో 68.48, పటాన్‌చెరులో 58.94, దుబ్బాకలో 78.69, గజ్వేల్‌లో 76.41శాతం నమోదు కాగా మొత్తంగా 71.33 శాతం పోలింగ్ నమోదైంది.




