19-10-2025 12:00:00 AM
హైదరాబాద్, అక్టోబర్ 18(విజయక్రాంతి): 42% బీసీ రిజర్వేషన్లకు ప్రధాన శత్రువు బీజేపీయేనని, సంచార జాతులకు న్యాయం చేయాలని డీఎన్‌టీ అడ్వకేట్స్ ఫోరం అధ్యక్షుడు సత్యనారాయణ గుండ్లపల్లి డిమాండ్ చేశారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించామని, అయితే ఈ రిజర్వేషన్ అమలులో బీజేపీ అడ్డంకులు సృష్టించడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఫోరం ప్రతినిధులు మాట్లాడుతూ సంచార జాతులు దశాబ్దాలుగా సామాజిక, రాజకీయంగా వెనుకబడి ఉన్న వర్గాలు అని, ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో వీరికి ప్రాతినిధ్యం దొరకలేదు అని అన్నారు. 42% బీసీ రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణను అమలు చేస్తేనే సంచార జాతులకు న్యాయం జరుగుతుందన్నారు.
అనంతరామన్ కమిషన్ సిఫారసుల మేరకు విద్యా, ఉద్యోగాల్లో వర్గీకరణ అమలు జరుగుతోంది. అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నిక ల్లో కూడా వర్గీకరణ తప్పనిసరి చేయాలి అని ఫోరం నాయకులు పేర్కొన్నారు. సంచార జాతుల రాజకీయ పునరుద్ధరణ కోసం స్థానిక సంస్థల్లో వర్గీకరణను వెంటనే అమలు చేయాలని, బీసీ రిజర్వేషన్లను రక్షించాలని విజ్ఞప్తి చేశారు.