23-07-2025 01:20:17 AM
- రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమంలో రాంచందర్‌రావు
- 9వ షెడ్యూల్‌లో బీసీ రిజర్వేషన్లు చేర్చమనడం విద్రోహ చర్య
- రాంచందర్‌రావు 48 గంటల్లోగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి
- లేదంటే బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్
ముషీరాబాద్, జూలై 22: బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చడం కుదరదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఢిల్లీలో ప్రకటించడాన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నామని, బీసీ రిజర్వేషన్లు పెంచకపోతే బీజేపీ బీసీల ద్రోహుల పార్టీగా చరిత్రలో నిలిచిపోతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. హైదరాబాదులోని దోమలగూడలో బీసీ భవన్‌లో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
విద్యార్థిగా ఉన్నప్పుడే ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర ఉన్నదని, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత తొలిసారి చేపట్టిన ఢిల్లీ పర్యటనలో సామాజిక రిజర్వేష న్లపై తనకున్న వ్యతిరేక భావాన్ని, బీసీ రిజర్వేషన్లపై లేనిపోని అబద్ధాలు చెపుతూ తనకు న్న విషం వెళ్లగెక్కాడని శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు 50 శాతం సీలింగు విధించిందని చెపుతున్న రాంచందర్‌రావు.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు విషయంలో పరిమితి దాటి 60 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న విషయం స్వతహా గా న్యాయవాది అయిన ఆయనకు తెలియదా అని జాజుల ప్రశ్నించారు.
బీజేపీలో బీసీ నేతలను పార్టీ నుంచి పొమ్మనకుండా పొగపెట్టి గెంటివేసే కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఉప రాష్ట్రపతి ధన్‌ఖడ్ చేత రాజీనామా చేయించారని, హర్యానా గవర్నర్ దత్తాత్రేయను పదవి నుంచి తొలగించారని ఆరోపించారు. బీసీ సీఎం నినాదంతో ఎన్నికలకు వెళ్లిన బీజేపీ.. కనీసం ప్రతిపక్ష నేత కూడా అత్యంత సీనియర్ అయిన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజాసింగ్‌కు ఇవ్వకుండా అవమానించి పార్టీలో నుంచి గెంటివేశారని మండిపడ్డారు.
రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీని నియమిస్తామని నమ్మించి ఇవ్వకుండా మోసం చేశారని శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. బీసీలను పంపించడం ఉపరాష్ట్రపతితో ఆగదని భవిష్యత్తులో బీసీ ప్రధాని అయిన నరేంద్రమోదీని కూడా ప్రధాని పీఠం నుంచి దించి వేయడానికి కుట్రలు చేస్తున్నారని తెలిపారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు 10 శాతం ముస్లిం సామాజిక వర్గానికి కేటాయిస్తున్నారని కేంద్రమం త్రి బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. డాక్టర్ లక్ష్మణ్ మాత్రం బీసీ రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని చెపుతున్నారని తెలిపారు.
నాటి మండల కమిషన్ నుంచి మొదలుకుంటే నేటి బీసీ రిజర్వేషన్ల వరకు బీజేపీ బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూనే ఉన్నదని, దీనిని బీజేపీలో ఉన్న బీసీలంత గ్రహించి ఆ పార్టీకి రాజీనామా చేసీ నిరసనను తెలియజేయాలని కోరారు. బీజేపీలో అగ్రకులాల హిందువులకు ఒకరకంగా బీసీ హిందువులపై ఇంకొక రకంగా వ్యవహరిస్తూ కక్షగట్టి వివక్షతతో వ్యవహరిస్తున్నారని, ఈ వైఖరి మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీసీలం తా ఏకమై బీజేపీని రాజకీయంగా భూస్థాపితం చేస్తారని శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరిం చారు. 48 గంటల్లోగా బీసీ రిజర్వేషన్లపై రాంచందర్‌రావు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే బీజేపీ కార్యాలయం ముందు చాకిరేవు నిర్వహించి కార్యాలయా న్ని ముట్టడిస్తామని శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు.
ఈ సమావేశంలో బీసీ కుల సంఘా ల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, కార్యనిర్వహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం బీసీ విద్యార్థి సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్‌గౌడ్, బీసీ యువజ న సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యాం కుర్మ, రావులకోల్ నరేష్ ప్రజాపతి, గూడూరు భాస్కర్ మేరు, బూడిద మల్లికార్జున్ యాదవ్, పానుగంటి విజయ్, వరికు ప్పల మధు, నాగరాజ్ గౌడ్, తారాకేశ్వరి, కడారి వెంకటేష్ గౌడ్, పాలకూరి కిరణ్, ఇంద్రం రజక, గణం నరసింహ కూర్మ, సమతా యాదవ్, సంధ్యారాణి, దేవిక, లావణ్య పాల్గొన్నారు.