కల్వకుర్తిలో ‘పేపర్ పులుల’ జోరు..
పార్టీ కోసం పని చేయరు... సంబరాలకు మాత్రం ముందుంటారు. కల్వకుర్తి నియోజకవర్గ అధికార పార్టీలో ఇప్పుడు ఒక వింత పరిస్థితి నెలకొంది. నియోజకవర్గ అభివృద్ధి కోసం, పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో చెమటోడ్చే నాయకులు ఒకరైతే... పబ్లిసిటీ, ప్రోటోకాల్ హడావుడి చేసే నాయకులు మరొకరు తయారయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కల్వకుర్తి నియోజకవర్గం అమనగల్ బ్లాక్ పరిధిలోని మండలాల్లో ఈ పరిస్థితి మరీ ఘోరంగా ఉందంటూ స్థానిక కార్యకర్తలు, ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.
అమనగల్లు, జూన్ 29(విజయక్రాంతి): పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయాలన్నా, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నా ఈ ‘పేపర్ పులులు’ ఎక్కడా కనబడరు. ఎండనక, వాననక పార్టీ జెండా మోసే సాధారణ కార్యకర్తలకు వీరు ఏనాడూ అండగా నిలబడింది లేదు. కానీ, అధిష్టానం నుంచి ఏదైనా విజయం దక్కినా లేదా విజయ్ సంబరాలు (పార్టీ వేడుకలు) జరిగినా చాలు... అందరికంటే ముందే వచ్చి ఫ్లెక్సీలకు ఫోజులిస్తూ, మొదటి వరుసలో నిలబడిపోతారు.
ప్రోటోకాల్ లేదు... మర్యాద లేదు
నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారిక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినప్పుడు కనీస ప్రోటోకాల్ పాటించకుండా వీరు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. నిజమైన ప్రజాప్ర తినిధులను, స్థానిక సంస్థల నాయకులను పక్కకు నెట్టేసి... తామేదో ఈ పనులన్నీ మంజూరు చేయించినట్లుగా కలరింగ్ ఇస్తుంటారు. అమనగల్ బ్లాక్ పరిధిలోని ఆమ నగల్లు, కడ్తల్, తలకొండపల్లి, మాడ్గుల మండలాల్లో ఈ వింత ప్రవర్తన మరీ ఎక్కువగా కనిపిస్తోందని స్థానికులు మండిపడుతున్నారు.సాధారణ రోజుల్లో ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా అందుబాటులో ఉండని కొందరు నేతలు, కేవలం ఫోటోలకు, వార్తలకు ఎక్కేందుకు వీలయ్యే కార్యక్రమాల్లో మాత్రం అకస్మాత్తుగా ప్రత్యక్షమవుతుంటారు. ఈ ‘అదృశ్య-ప్రత్యక్ష’ రాజకీయం చూసి సొంత పార్టీ శ్రేణులే ముక్కున వేలేసుకుంటున్నాయి.
కార్యకర్తల ఆవేదన ‘నిజంగా పార్టీ కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం తిరిగే నాయకులకు గుర్తింపు దక్కడం లేదు. కేవలం ఫోటోలకు ఫోజులిస్తూ, పేపర్లలో పేర్లు వేయించుకునే ‘పేపర్ పులుల’ హంగామా ఎక్కువైపోయింది. అధికార పార్టీలో పెరిగిపోయిన ఈ సంస్కృతిని అధిష్టానం గమనించి, కట్టడి చేయకపోతే అసలుకే ఎసరు వస్తుంది.‘ అని స్థానిక సీనియర్ కార్యకర్తలు అంతర్గత సంభాషణల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మరి ఈ ‘పేపర్ పులుల’ హడావుడికి స్థానిక ముఖ్య నాయకత్వం ఎప్పుడు బ్రేకులు వేస్తుందో చూడాలి.






