నలు స్కాంల దిగ్బంధం
కీలక దశకు కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ ఒప్పందాలు, గొర్రెల పంపిణీ స్కాం కేసులు
విచారణను వేగవంతం చేసిన ఏసీబీ, సిట్, కమిషన్లు
గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారుల నుంచి వివరాల సేకరణ
త్వరలో కుంభకోణాల వెనుక పెద్దతలల పేర్లు బయటపడతాయని ఉత్కంఠ
హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలు, అవినీతి.. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా కొందరు పోలీస్ అధికారులు పాల్పడిన ఫోన్‌ట్యాపింగ్.. విద్యుత్‌శాఖ పరిధిలో జరిగిన చీకటి ఒప్పందాలు, యాదా ద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రం (వైటీపీఎస్) నిర్మాణంలో అవకతవకలు.. గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించిన నిధుల దారి మళ్లింపుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విచారణ కమిషన్లు, సిట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నాలుగు కుంభకోణాలపై విచారణ వేగవంతంగా జరుగుతున్నది. కమిషన్ సభ్యులు, ఏసీబీ, సిట్ అధికారులు, ఇప్పటికే గతంలో విధులు నిర్వర్తించిన ఉన్నతాధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీలను విచా రించింది. వీరికే కాక గతంలో ఆయాశాఖల్లో పనిచేసిన కీలక అధికారు లకూ విచారణకు రమ్మని సమన్లు అందుతున్నాయి. ఈ కేసులో త్వరలోనే కేసుల వెనుక పెద్ద తలల పేర్లు బయటపడతాయని అధికార వర్గాల్లో చర్చ నడుస్తున్నది.
కాళేశ్వరం అక్రమాలపై..
గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన అక్రమాలు, అవినీతి విచారణపై రాష్ట్రప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో కమిషన్‌ను నియమించిన విషయం తెలిసిందే. బృందానికి ప్రత్యేక నిపుణులు సాంకేతిక సహకారం అందిస్తున్నారు. ఇప్పటికే విచారణ బృందం మూడుసార్లు రాష్ట్రానికి వచ్చి, రెండుసార్లు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులను సందర్శించింది. మరోవైపు నీటిపారుదలశాఖ అధికారులు, కార్యదర్శి స్థాయి అధికారులతో అనేక దఫాలుగా చర్చలు సాగించింది.
తమకు కావాల్సిన రికార్డులు, దస్త్రాలను సేకరించి వాటిపై అధ్యయనం చేస్తోంది. ఐఐటీ, ఎన్‌ఐటీ, ఆడిటింగ్ నిపుణులతో కలిసి బ్యారేజీల నిర్మాణం, డిజైన్లపై సుధీర్ఘమైన చర్యలు సాగిస్తున్నది. అందిన సమాచారాన్నంతా విశ్లేషిస్తున్నది. గత ప్రభుత్వ హయాంలో ఈఎన్సీగా వ్యవహరించిన మురళీధర్‌రావు రిటైర్డ్ అయిన తర్వాత కూడా విచారణకు పిలిపించింది. హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌లో సోమవారం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు మాజీ ఈఎన్‌సీ మురళీధర్‌రావు, ఇతర అధికారులు నల్లా వెంకటేశ్వర్లు, నరేందర్‌తో సహా ఏడుగురిని కమిషన్ విచారించింది.
కమిషన్ అడిగిన ప్రశ్నలకు అధికారులు తమకు తెలిసినంత వరకు సమాచారం ఇచ్చినట్లు సమాచారం. ఇలా కమిషన్ ఒక్కో రికార్డును పరిశీలిస్తూ.. ప్రాజెక్ట్ పరిధిలో ఏ నిర్ణయంలో ఎవరి పాత్ర ఎంత? ఎవరెవరి ప్రమేయం ఎంత వరకు ఉంది? అన్న అంశాలపై విచారణ సాగినట్లు తెలుస్తున్నది. అలాగే కమిషన్ మంగళవారం మరో 18 మంది అధికారులను విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో విచారణ కీలక దశకు చేరినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇకపై కీలక పాత్రధారుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.
కీలక దశకు ‘ఫోన్ ట్యాపింగ్’ కేసు..
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) విచారణను వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ కేసులో నిందితుడైన ప్రణీత్‌రావు మొదలుకుని అందరినీ సిట్ విచారించింది. మరికొందరు ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో కీలక పాత్రధారి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్‌రావు ఈనెల 16న అమెరికా నుంచి రానున్నట్లు పోలీసు వర్గాలకు సమాచారం అందింది. ఆయన రాష్ట్రానికి చేరుకోగానే పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని కోర్టు అనుమతితో విచారణ చేపట్టాలని సిట్ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది. ఆయన్ను విచారిస్తే ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న పెద్ద తలకాయల పేర్లు బయటకు వస్తాయని రాజకీయ, పోలీసు వర్గాల్లోనూ చర్చ సాగుతోంది.
విద్యుత్తు ఒప్పందాలపై గోల్‌మాల్..
గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్తు ఒప్పందాలు, యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రం (వైటీపీఎస్) నిర్మాణంలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్‌ను నియమించిన సంగతి తెలిసిందే. కమిషన్ ఇప్పటికే వైటీపీఎస్‌ను సందర్శించింది. ప్లాంట్‌కు సంబంధించిన పలు రికార్డులను అధ్యయనం చేస్తోంది. ఇప్పటికే కిందిస్థాయి అధికారులను విచారించింది.
తాజాగా సోమవారం బీఆర్‌కే భవన్‌లో కమిషన్ కార్యాలయంలో గత ప్రభుత్వంలో విద్యుత్తుశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీలుగా పనిచేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి సురేష్‌చందా, మరో సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్‌తో పాటు ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీగా బాధ్యతలు నిర్వర్తించిన దేవులపల్లి ప్రభాకర్‌రావును కమిషన్ విచారించింది.
గొర్రెల స్కాం విలువ రూ. 700 కోట్లు..
గొర్రెల స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. కేసులో పశుసంవర్ధక శాఖ మాజీ ఎండీ రాంచందర్‌నాయక్, నాటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్‌కుమార్ మూడు రోజుల ఏసీబీ కస్టడీకి కోర్టు అనుమతించింది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఏసీబీ అధికారులు వీరిద్దరినీ బంజారాహిల్స్‌లోని ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారించనున్నారు.
తొలుత గొర్రెల పంపిణీ స్కాంలో రూ.2.10 కోట్లు దారి మళ్లించినట్లు ఏసీబీ గుర్తించింది. రామ్‌చందర్‌నాయక్, కల్యా ణ్‌కుమార్ అరెస్ట్ తర్వాత స్కాం ఏకంగా రూ.700 కోట్ల మేర జరిగిందనే విషయం బయటకు వచ్చిం ది. ఈ కేసులో కాంట్రాక్టర్ మొహినుద్దీన్ పరారీలో ఉన్నట్లు తెలిసింది. ఏసీబీ విచారణలో ఇంకా కుంభకోణం వెనక ఎవరెవరున్నారు? కేసులో రాజకీయ ప్రముఖులకు సంబంధాలున్నాయా? అనే విషయాలు బయటకు రావాల్సి ఉన్నది.






