7 July, 2026 | 8:13 AM

త్వరలో విద్యా, వ్యవసాయ కమిషన్‌లు

11-06-2024 01:35 AM

ప్రభుత్వ పాఠశాలల్లో సెమీ రెసిడెన్షియల్ విధానం

ప్రభుత్వ బడుల బాధ్యతలను మహిళా సంఘాలకే అప్పగించాం

ప్రభుత్వ స్కూళ్లో చదివి 10/10 జీపీఏ తెచ్చుకున్న విద్యార్థులకు ప్రతిభాపురస్కారాలు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి

తద్వారా సమస్యల పరిష్కారానికి వెసులుబాటు

రెసిడెన్షియల్ స్కూళ్లతో పేరెంట్స్, పిల్లల మధ్య అంతరం

బలహీన పడుతున్న బంధాలు, మాతృత్వానికి పిల్లలు దూరం

90 శాతం ఐఏఎస్, ఐపీఎస్‌లు చదివింది సర్కారు బడుల్లోనే

ప్రభుత్వ పాఠశాలల విలువేంటో నాకు తెలుసు

అందుకే  మహిళా సంఘాలకే నిర్వహణ బాధ్యతలు

టెన్త్ విద్యార్థుల ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): త్వరలోనే విద్య, వ్యవసాయ కమిషన్‌లను ఏర్పాటు చేసి, రెండు రంగాలకు పెద్దపీట వేయాలనుకుంటున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. విద్యా కమిషన్ ద్వారా ఎప్పటికప్పుడు విద్య, ఉపాధ్యాయ, పాఠశాల సమస్యలను పరిష్కరిస్తా మన్నారు. విద్యకోసమే నిరంతరం ఒక వ్యవస్థ పనిచేసేలా దాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

మహిళా కమిషన్, ఎస్సీ, ఎస్టీ తదితర కమిషన్ తరహాలోనే విద్యారంగంలోని సమస్యలను విద్యాకమిషన్ పరిష్కరిస్తుందన్నారు. అలాగే వ్యవసాయ కమిషన్ సైతం ఏర్పాటు చేస్తామని, నకిలీ విత్తనాలు, రైతు సమస్యలను పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. సోమవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రభుత్వ పాఠశాలల్లో 10 జీపీఏ సాధించిన పదో తరగతి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరై మాట్లాడారు. గతంలో ఒకే సిలబస్‌ను ఏళ్ల తరబడిగా అమలు చేసేవారని, మారిన పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఇకపై విద్యా కమిషన్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సిలబస్‌ను మారుస్తామని, విలువైన సూచనలు ఎవరు చేసినా వాటిని తప్పక పాటిస్తామన్నారు.

అమ్మ ఒడికి దూరంగా పిల్లలు..

రెసిడెన్షియల్ స్కూళ్లలో పిల్లలను చిన్నప్పుడే చేర్పించడం ద్వారా అమ్మఒడికి దూ రం చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. ప్రతీ విద్యార్థికి అమ్మఒడే తొలి పాఠశాల అన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లతో తల్లిదండ్రులు, పిల్లల మధ్య సంబంధ బాంధవ్యాలు బలహీన పడుతున్నాయని ఒక నివేదిక తెలిపిందన్నారు. ఇది రానున్న రోజుల్లో ఒక సామాజిక రుగ్మతగా, సమస్యగా మారే ప్రమాదం ఉంద న్నారు. కన్నవారికి, పుట్టిన ఊరికి దూరంగా పెరుగుతున్నారనన్నారు. అందుకే ఒకవైపు రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రోత్సహిస్తూనే మరోవైపు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామన్నారు. గ్రామాల్లో ఉండే పాఠశాలలపై నిర్లక్ష్యం వహించొద్దన్నారు.

సెమీ రెసిడెన్షియల్ విధానం

ప్రభుత్వ పాఠశాలల్లో సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని అమలు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సా యంత్రం స్నాక్స్  ఇచ్చేలా రానున్న రోజుల్లో చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ బడు ల్లో  చదివేది ఎక్కువ మంది పేద కుటుంబాల పిల్లలేనని, వారు పిల్లల్ని బడుల్లో వదిలేసి సాయంత్రం వరకూ పనులకు వెళ్తుంటారన్నారు. ఇలాంటి వారికోసం సెమీ రెసిడెన్షి యల్ విధానం మంచి ఫలితాలను అందిస్తోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

గత పాలనలో సర్కారు స్కూళ్లు నిర్వీర్యం

కొంత కాలంగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమవతుతున్నాయని, స్కూళ్లలో ఉపాధ్యాయులు లేరని విద్యార్థులు రావడంలేదు, విద్యార్థుల్లేరని బడులు మూసివేశారన్నారు. ఇది కోడి ముందా, గుడ్డు ముందా అన్నట్లుగా తయారైందన్నారు. ప్రభుత్వం టీచర్లను పెట్టకపోతే విద్యార్థులు రారు, విద్యార్థులు రావడంలేదనే నెపంతో సింగిల్ టీచర్ పాఠశాలలన్నింటినీ మూసివేసే పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో కొనసాగిందన్నారు. కొన్ని బడుల్లో విద్యార్థుల సంఖ్య కంటే కూడా టీచర్ల సంఖ్యే ఎక్కువగా ఉన్న పరిస్థితి ఉందన్నారు. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

విద్యార్థులు ఇంటర్‌లోనూ రాణించాలి

రవీంద్రభారతిలో విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వందేమాతరం ఫౌండేషన్‌ను సీఎం అభినందించారు. ప్రభుత్వ బడుల్లోని విద్యార్థుల్ని ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. నిజానికి ఈ విద్యార్థులను ప్రభుత్వమే సన్మానించాలని, మట్టిలో మాణిక్యాలుగా రాణించిన విద్యార్థులు ప్రభుత్వానికి మంచి పేరుత తెస్తున్నారన్నారు. నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలకు ధీటుగా సర్కారు బడి విద్యార్థులు రాణించడం తమకు గర్వకారణ మన్నారు. ఇప్పుడు 10/10 జీపీఏ సాధించిన విద్యార్థులు ఇంటర్‌లోనూ ర్యాంకులను సాధించాలన్నారు. లక్ష్యాలను నిర్ధేశించుకొని ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు కావాలని ఆకాంక్షించారు.

విలువైన సూచనలు ఇవ్వొచ్చు

విలువైన సూచనలు, సలహాలు ఎవ్వరిచ్చినా తమ ప్రభుత్వం తప్పకుండా పాటిస్తుందని సీఎం అన్నారు. అన్ని తమకే తెలుసని ఎప్పుడూ అనుకోమన్నారు. ప్రజలకు మేలుచేసే అంశాలు, ప్రభుత్వ విద్యపై నివేదికలను, అధ్యాయనాలను ఇచ్చేందుకు ఎవ్వరొచ్చినా తమ అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. అనంతరం పదో తరగతిలో 10/10 జీపీఏ తెచ్చుకున్న పలువురు విద్యార్థినులకు సీఎం ప్రతిభా పురస్కారాలు ఇచ్చారు.

ఇదిలా ఉంటే దీనికంటే ముందు వరంగల్ జిల్లాకు చెందిన భువన జ్యోతి చేసిన విజ్ఞప్తి మేరకు 10/10 జీపీఏ తెచ్చుకున్న 230 మంది విద్యార్థులకు గురుకులాల్లో లేదా ప్రైవేటులో ఇంటర్ అడ్మిషన్లు ఉచితంగా కల్పించాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి సీఎం ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి, సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, మాజీ ఏజీ ప్రకాష్ రెడ్డి, టీజీఆర్టీసీ ఎండీ సజ్జనార్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, వందేమాతరం ఫౌండేషన్ నిర్వాహకులు రవీందర్‌తోపాటు 230 మంది విద్యార్థులు, 229 మంది హెచ్‌ఎం లు, టీచర్లు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సర్కారు బడి విలువ నాకు తెలుసు

సర్కారు బడిలో చదివిన తనకు వాటి విలువ తెలుసని సీఎం రేవంత్ అన్నారు. ఇటీవల పీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీ, ఈనెల 12న ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడు, తానూ ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారిమేనని పేర్కొన్నారు. ఇప్పుడు సర్వీసులో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో 90 శాతం మంది ప్రభుత్వ స్కూళ్లలో చదువుకున్నవారేనని చెప్పా రు. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ.80 వేలు ఖర్చు పెడుతోందని, ప్రభుత్వం పెట్టే ఖర్చులో అధిక శాతం టీచర్ల జీతాలకు, స్కూళ్లలో మౌలిక వసతులకే పోతున్నదన్నారు. డీఎస్సీ ద్వారా 11 వేలకు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని స్కూళ్లపై తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాలని, పిల్లలను చేర్పించకపోతే ఆ పాఠశాలలు మూతబడుతాయని వివరించాలన్నారు.

సర్కారు బడి బాధ్యత ‘అమ్మ’లకే...

ప్రభుత్వ బడుల బాధ్యతలను స్వయం సహాయక మహిళా సం ఘాల గ్రూపులు, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలకే అప్పగించినట్లు సీఎం తెలిపారు. మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా వారికే ఇచ్చి నిధు లు గ్రీన్ ఛానెల్ ద్వారా విడుదల చేయాలని ఆర్థికశాఖను ఆదేశించామన్నారు. రూ.2 వేల కోట్ల నిధు లను శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ బడులను అభివృద్ధి చేసేందుకు కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు. సింగిల్ టీచర్ పాఠశాలలను మూసేయడానికి వీళ్లేదన్నారు.

తండాలు, గూడేళ్లో, మారుమూల గ్రామాల్లో ప్రభుత్వ బడులను పునర్నిర్మిస్తున్నామని, తద్వారా పేదలు, దళితులు, గిరిజనులకు విద్య అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ద్వారా తల్లిదండ్రుల్లో ప్రభుత్వ బడులపై అవగాహనను పెంచాలని సూచించారు. విద్యమీద పెట్టే ఖర్చును పెట్టుబడిగా చూడాలన్నారు. సర్కా రు బడిలో చదివే విద్యార్థులకు ఉచితంగా భోజనం, పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాం అందిస్తున్నామని ఆయన తెలిపారు.