calender_icon.png 30 July, 2025 | 4:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలకు 42% రిజర్వేషన్ల అమలును అడ్డుకుంటే సహించేది లేదు

29-07-2025 05:34:54 PM

బీసీ బిల్లును 9వ షెడ్యూల్ లో చేర్చే విధంగా కృషి చేయాలి..

బీఆర్ఎస్, బీజేపీలు తప్పుడు గోబెల్స్ ప్రచారాన్ని మానుకోవాలి..

బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలును అడ్డుకునే ప్రయత్నాలను సహించేది లేదని, బీసీ ఎంపీలందరు పార్లమెంట్ లో బీసీ బిల్లును 9వ షెడ్యూల్ లో చేర్చే విధంగా కృషి చేయాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ హితవు పలికారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్ల పెంపుపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అదేపనిగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చినా, ఆర్థినెన్స్ తెచ్చినా కోర్టుల్లో నిలవదనే గోబెల్స్ ప్రచారాన్ని మానుకోవాలని  చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు, కేంద్రమంత్రి బండి సంజయ్ బీసీ రిజర్వేషన్లపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించి గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపి 3 నెలలు గడిచిందన్నారు.

అయినా నేటికీ దానికి ఆమోదం తెలపకుండా బీసీలకు అన్యాయం చేస్తూ, మత ప్రాతిపదికన రిజర్వేషన్లు అంటూ తప్పించుకోవడం వారి దివాలాకోరుతనానికి నిదర్శనమని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం బీసీలకు అమలవుతున్న 27 శాతం రిజర్వేషన్లలో సైతం ముస్లిం సమాజం ఉన్నదని గుర్తుచేశారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన చాలా రాష్ట్రాల్లో ముస్లింలకు రిజర్వేషన్లను మత ప్రాతిపదికన అమలు చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉందన్నారు. ఇక బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ ప్రభుత్వంలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంలో పాలుపంచుకొని ఈ రోజు బీసీ రిజర్వేషన్లు పెంచాలని మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉందన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వం పై బీఆర్ఎస్ ఢిల్లీలో ధర్నా చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీసీ యువజన సంఘం జిల్లా కార్యదర్శి ఎలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, శేరి రవీందర్, నారగోని వెంకట్, జె. నాగరాజు తదితరులు పాల్గొన్నారు.