26-08-2025 07:24:34 PM
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి టౌన్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద యూరియా స్టాక్ అందుబాటులో లేకపోతే, స్టాక్ అధికంగా ఉన్న ప్రైవేటు ఫర్టిలైజర్ దుకాణాల వివరాలతో పిఎసిఎస్ ల వద్ద బోర్డును ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ లో ఉన్న రాజారాం ట్రేడర్స్ అనే ప్రైవేటు ఫర్టిలైజర్ దుకాణాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫర్టిలైజర్ దుకాణంలో ఇప్పటివరకు ఎంత మేర యూరియా అమ్ముడుపోయింది అనే విషయాలను రిజిస్టర్ చూసి పరిశీలించారు.
అదేవిధంగా ఆ దుకాణానికి సంబంధించి యూరియా నిల్వ గోడౌన్ ను సందర్శించి తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఫర్టిలైజర్ దుకాణాల్లో, సంబంధిత ఏఈఓ వద్ద ఇదివరకే యూరియా తీసుకొని వెళ్ళిన రైతుల వివరాలకు సంబంధించిన జాబితా తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. రైతులు మళ్లీ యూరియా కోసం వచ్చినప్పుడు ఇదివరకే వారు ఎంత తీసుకొని వెళ్లారు అనే సమాచారాన్ని తనిఖీ చేయాలని ఇందుకోసం ఏఈఓలు పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. అదేవిధంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద యూరియా స్టాక్ అందుబాటులో లేకపోతే, స్టాక్ అధికంగా ఉన్న ప్రైవేటు ఫర్టిలైజర్ దుకాణాల వివరాలతో పిఎసిఎస్ ల వద్ద బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ముందుగా చిన్న కారు రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. అవసరం మేరకు మాత్రమే యూరియా విక్రయించాలని, అవసరానికి మించి అదనంగా విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు. ఎకరాకు ఒక బస్తా మాత్రమే అమ్మాలని, అది కూడా పట్టాదార్ పాస్ పుస్తకం చూసి ఆ తర్వాతే ఇవ్వాలని ఆదేశించారు.