26-08-2025 07:28:49 PM
వనపర్తి,(విజయక్రాంతి): జిల్లాలో యూరియా కోసం వచ్చే రైతులకు అవసరం మేరకే ఇవ్వాలని అదనంగా ఇవ్వడానికి వీల్లేదని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం నాగవరం శివారులో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా నిల్వ ఎంత ఉంది? రైతులకు ఎంత మేర సరఫరా చేస్తున్నారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో యూరియా కోసం వచ్చే రైతులకు అవసరం మేరకే ఇవ్వాలని అదనంగా ఇవ్వడానికి వీల్లేదని సూచించారు.
ఎకరానికి కేవలం ఒక బస్తా మాత్రమే ఇవ్వాలని, అది కూడా పట్టాదార్ పాస్ పుస్తకం తనిఖీ చేసిన తర్వాతే ఇవ్వాలని అదనంగా ఇస్తే చర్యలు తప్పవని సూచించారు. రైతులు ఎక్కువమంది వచ్చి లైన్లో ఉంటే వారికి మొదటిసారి ఎంత ఇచ్చారు అనే వివరాలను చెక్ చేయాలని సూచించారు. ఏఈవోలు దగ్గర ఉండి పర్యవేక్షించాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పిఎసిఎస్ లో యూరియా నిల్వకు సంబంధించిన రిజిస్టర్ లను తనిఖీ చేశారు. తహసిల్దార్ రమేష్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి, ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.