01-11-2025 07:12:05 PM
ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి..
జడ్చర్ల: ఏ నియోజకవర్గానికి చెందిన పత్తి రైతులు ఆ నియోజకవర్గంలోనే తాము పండించిన పత్తిని అమ్ముకోవాలన్న సరిహద్దు సమస్యతో సతమతమౌతున్న పత్తి రైతుల సమస్య ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో సమస్య పరిష్కారం కావడం జరిగిందని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు. ఒక్క జడ్చర్ల నియోజకవర్గంలోని పత్తి రైతులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్యను ఎదుర్కొంటున్న వేలాదిమంది పత్తి రైతులకు కూడా ఊరట లభించిందన్నారు. ఈ ఉదంతం వివరాల్లోకి వెళ్తే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే పత్తి కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకూ ఆయా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని రైతులు మాత్రమే పత్తి పంటను అమ్ముకొనే అవకాశం ఉండేదని, ఈ కారణంగా ఒక నియోజకవర్గం పరిధిలో ఉండే కొనుగోలు కేంద్రంలో మరో నియోజకవర్గానికి చెందిన రైతులు పత్తిని అమ్ముకొనే అవకాశం ఉండేది కాదన్నారు.
జిల్లాలు, నియోజకవర్గాలు వేరైనప్పటికీ భౌగోళికంగా సమీపాన ఉన్న ప్రాంతాలైనా రైతులు అక్కడికి వెళ్లి పత్తిని అమ్ముకొనే వీలు లేకపోవడంతో దూరా భారమైనప్పటికీ పత్తి రైతులు తమ నియోజకవర్గం పరిధిలోని పత్తి కొనుగోలు కేంద్రానికే వెళ్లి విక్రయించేవారని, ఉదాహరణకు చెప్పాలంటే బాలానగర్ ప్రాంతం రంగారెడ్డి జిల్లాలోని షాద్ నగర్ నియోజకవర్గానికి కేవలం 5 కి.మీల దూరంలోనే ఉండగా, జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన బాలానగర్ రైతులు తెచ్చిన పత్తిని షాద్ నగర్ లో కొనుగోలు చేసేవారు కాదని, తప్పనిసరి పరిస్తితుల్లో ఆ రైతులు దాదాపు 30 కి.మీ.ల దూరంలోని జడ్చర్ల కొనుగోలు కేంద్రానికి వెళ్లి పత్తిని విక్రయించేవారన్నారు.
రవాణా ఖర్చులు పెరగడంతో పాటుగా రైతులు వ్యయప్రయాసలు పడేవారని, తను ప్రత్యేకంగా తీసుకుని అక్టోబర్ 28న రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి నేరుగా ముంబైకి వెళ్లి అక్కడి సీసీఐ కార్యాలయంలో సీసీఐ ఛైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ లలిత్ కుమార్ గుప్తాను కలిసి ఈ సమస్యను గురించి వివరించన్నని, ఈ విషయంగా సానుకూలంగా స్పందించిన గుప్తా బాలానగర్ రైతులు షాద్ నగర్ లో కూడా తమ పత్తిని అమ్ముకొనేందుకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చిన విషయం ఇప్పటికే చెప్పాను అన్నారు. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్ వారి ఆధ్వర్యంలో పొరుగున ఉన్న జిల్లాలకు సంబంధించిన మ్యాపింగ్ కార్యక్రమాన్ని పూర్తి చేశామని సీసీఐ అధికారులు శనివారం మొయిల్ ద్వారా సమాచారం పంపించారని పేర్కొన్నారు. జిల్లాల మ్యాపింగ్ తో పత్తి రైతులు తమ సొంత నియోజకవర్గాల్లోని కేంద్రాల్లోనే కాకుండా భౌగోళికంగా సమీపంలో ఉన్న ప్రాంతాల్లో కూడా పత్తిని అమ్ముకొనేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. దీంతో పత్తి కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకూ ఉన్న సరిహద్దు సమస్య సమసిపోయిందన్నారు.