06-12-2024 03:13:29 AM
డే టైంలో జంక్‌ఫుడ్ యాడ్స్‌పై నిషేధం
2025 అక్టోబర్ నుంచి అమలు
లండన్, డిసెంబర్ 5: బ్రిటన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో పగటి సమయాల్లో జంక్‌ఫుడ్‌పై టీవీల్లో ఎటువంటి వ్యాపార ప్రకటనలు(యాడ్స్) ప్రసారం చేయకుండా నిషేధం విధించింది. దేశంలో ఎక్కువమంది చిన్నారులు ఊబకాయంతో బాధ పడుతుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలోని పదిమంది పిల్లల్లో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నట్లు, ఐదేళ్ల వయసున్న వారిలో 23.7 శాతం మంది జంక్‌ఫుడ్‌లో ఉండే అధిక చక్కెర కారణంగా దంతక్షయ సమస్యను ఎదుర్కొంటున్నట్లు నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్‌హెచ్‌ఎస్) తన నివేదికలో పేర్కొన్నది.
దీంతో ప్రభుత్వం స్పందించి చిన్నారుల ఆరోగ్య సంరక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకున్నది. అధిక చక్కెర, కొవ్వు, సాల్ట్ మోతాదు ఎక్కువగా ఉన్న పదార్థాలు, కూల్ డ్రింక్స్ తదితర అనారోగ్యానికి కారణమయ్యే జంక్‌ఫుడ్ ప్రకటనలను పగటివేళ టీవీలో ప్రసారం చేయడంపై నిషేధం విధించింది. దీంతో పిల్లలు జంక్‌ఫుడ్ తినడం తగ్గిస్తారని పేర్కొన్నది. చిన్నారులు తీసుకునే ఆహార పదార్థాల నుంచి 7.2 బిలియన్ల కేలరీలను నిరోధించి, స్థూలకాయం రేటును తగ్గించడంలో కొత్తగా ప్రవేశపెట్టి నిబంధనలు మార్పు తీసుకువస్తాయని అధికారులు భావిస్తున్నారు.