calender_icon.png 15 December, 2025 | 7:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనాభాలో సింగ‘పూర్’

06-12-2024 03:07:47 AM

త్వరలోనే సింగపూర్ కనిపించదు: మస్క్

అనేక ఆసియా దేశాలదీ అదే తీరు..

రోబోలతో పనులు చేయించుకుంటున్న సింగపూర్

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరో ఆసక్తికర కామెంట్ చేశారు. ఆసియా ఖండంలోనే అతి సంపన్న దేశంగా వెలుగొందుతున్న సింగపూర్, అలాగే మరికొన్ని ఇతర దేశాలు కొద్ది రోజుల్లోనే కనుమరుగవుతాయని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆసియా ఖండంలోని అనేక దేశాల్లో పడిపోతున్న జననాల రేటును ఈ ట్వీట్ హైలెట్ చేస్తోంది. ఆసియా దేశాల్లోని వ్యక్తులు ఎక్కువ మంది పిల్లలను కనాలని మస్క్ వారిని అభ్యర్థించారు.

ఎక్కువ మంది పిల్లలను కనడం ద్వారా ప్రపంచాన్ని విపత్తు నుంచి కాపాడొచ్చని తెలిపారు. సింగపూర్ “బేబీ క్రైసిస్‌” అనే ఆర్టికల్ మీద మస్క్ ఇలా స్పందించారు. ఆసియా దేశాలైన సింగపూర్, సౌత్ కొరియాల్లోనే కాకుండా భారత్‌లో కూడా జనాభా అనేది క్రమంగా తగ్గిపోతుంది.

ఇన్ని రోజులు ఎక్కువ మంది పిల్లలను కనొద్దని చెప్పిన ప్రభుత్వాలు కూడా ప్రస్తుతం ఎక్కువ మంది పిల్లలను కనాలని మహిళలను ప్రోత్సహిస్తున్నాయి. జనాభా తగ్గడంతో సింగపూర్ చాలా చోట్ల రోబోలతో పనులు చేయించుకుంటూ నెట్టుకొస్తోంది. 

అప్పట్లో అలా.. ఇప్పుడిలా

1970వ దశకం వరకు సౌత్ కొరియా, జపాన్, చైనా తదితర దేశాల్లో స్త్రీలు సగటున ఐదుగురు పిల్లలను కనేవారు. కానీ రాను రాను ఆ పద్ధతులు మారిపోయాయి. కొన్ని రోజులు ప్రభుత్వాలు కూడా ఎక్కువ మంది పిల్లలను కనొద్దని జంటలకు హుకుం జారీ చేసింది.

కానీ ప్రస్తుతం జనాభా వేగంగా తగ్గిపోతుండడం కొత్త కలవరానికి దారి తీస్తోంది. గడిచిన 70 సంవత్సరాల్లో కేవలం ఆసియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో జననాల రేటు తగ్గిపోవడం గమనార్హం. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం రాబోయే ఆరు సంవత్సరాలలో సింగపూర్‌లో వృద్ధుల జనాభా 24 శాతానికి చేరుకోనుంది. సింగపూర్ కూడా జపాన్ లాగే ‘సూపర్ ఏజ్‌డ్ సొసైటీ’గా మారే అవకాశం ఉంది.