12-08-2025 12:13:14 AM
నాకు అడ్డు వస్తే బుల్డోజర్లతో తొక్కిస్తా
సిద్దిపేట, ఆగస్టు 11 (విజయక్రాంతి): బి.ఆర్.ఎస్ బడా నాయకుల చిట్టా త్వరలోనే విప్పుతానని వారందరి చిట్టపద్దుల ఆధారాలు తన వద్ద ఉన్నాయంటూ మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనంపల్లి హనుమంతరావు అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలంలోని కూడవెల్లి క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హనుమంతరావు మాట్లాడారు.
రాజకీయంగా తనను ఎదుర్కోలేక చక్రధర్ గౌడ్ లాంటి వారిని పావులుగా వాడుకొని, డబ్బులు ఇచ్చి తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. తనపై వచ్చే ఆరోపణలు పట్టించుకోనని తనకు అడ్డు వచ్చిన వారందరినీ బుల్డోజర్లతో తొక్కించుకుంటూ ముందుకు వెళ్తానని తెలిపారు. తనలాంటి పెద్ద నాయకుల పై విమర్శలు చేస్తే చక్రధర్ గౌడ్ గుర్తింపు లభిస్తుందని మూర్ఖత్వపు విమర్శలు చేస్తున్నాడని చెప్పారు.
మైనంపల్లి అంటేనే ప్రజలకు ధైర్యం, కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని, ప్రాణం ఉన్నంతవరకు సేవ చేస్తాడని నమ్మకం ఉంటుందని వెల్లడించారు. త్వరలోనే అందరి బాగోతం బయట పెడతానంటూ వెల్లడించారు. ఆయన వెంట దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.