12-08-2025 01:22:49 AM
బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం తర్జన భర్జన
హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాం తి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లా లు పడుతున్నది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది. మరోవైపు ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది. ఇది లాఉండగా రాజ్యాంగ సవరణ చేయాల్సిన కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ బిల్లుపై కొర్రీలు పెడుతుంటే, రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు, ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తున్నదని ఆరోపణలు గుప్పిస్తు న్నాయి.
దీనికితోడు తమకు చట్టబద్ధమైన రిజర్వేషన్లే కావాలని బీసీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సందిగ్ధంలో పడింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ముందు మూడు మార్గా లు ఉన్నాయి. ఒకటి రిజర్వేషన్‌ను అమలు చేస్తూ ప్రత్యేక జీవోను విడుదల చేయడం. రెండోది స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడం. మూడోది పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించడం.
ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. దీనికి తోడు సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ నెల 16, 17వ తేదీల్లో పీసీసీ, పీఏసీ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నందున బీసీ రిజర్వేషన్ల అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ముందు మూడు మార్గాలున్నప్పటికీ బీసీ రిజర్వేషన్ అంశాన్ని కొలిక్కి తీసుకొచ్చే మార్గంపై తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తోంది.
బీసీ రిజర్వేషన్ల అంశాన్ని పరిష్కరించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభు త్వం ఇప్పటికే అసెంబ్లీలో బిల్లు పెట్టింది. ప్రత్యేకంగా ఆర్డినెన్స్ రూపొందించింది. అయితే చివరగా రిజర్వేషన్లను అమలు చేస్తూ జీవో విడుదల చేయడమే మిగిలి ఉంది. ఈ క్రమంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ జీవో విడుదల చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. అయితే గత పదేళ్లలో దా దాపు 8 రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి నిర్ణయా లు జరిగాయి.
కానీ వాటిని కోర్టులు కొట్టివేయడమో లేక స్టే ఇవ్వడమో జరిగింది. అయి తే బీసీ రిజర్వేషన్ అంశాన్ని షెడ్యూల్ 9లో చేర్చితేనే కోర్టుల్లో వేసే సవాళ్లను వంద శాతం ఎదుర్కొని బీసీల రిజర్వేషన్ అంశం నిలుస్తుందని బీసీ మేధావులు చెబుతున్నారు. దీనికి తోడు షెడ్యూల్ 9లో చేర్చినా కోర్టులో సమీక్ష చేయవచ్చనే వాదన కూడా వినపడుతున్నది.
రిజర్వేషన్‌కు సంబంధించిన అంశాలు రాజ్యాంగ స్వరూపానికి వ్యతి రేకంగా ఉంటేనే కొట్టేస్తామని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై న్యాయపరమైన సమీక్షకు ఆస్కా రం లేకుండా, షెడ్యూల్ 9లో పెడితేనే రిజర్వేషన్లకు రక్షణ ఉంటుందని పలువురు వాదిస్తున్నారు.
కుంటుపడ్డ అభివృద్ధి..
సెప్టెంబర్ 30వ తేదీలోపు రిజర్వేషన్ అంశం తేల్చాలని, లేని పక్షంలో పాత రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వ హించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం పరిస్థితుల్లో హైకోర్టు నిర్దేశించిన గడువులోగా రిజర్వేషన్ల అంశం కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయడం ఒక మార్గంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అయితే ఎన్నికలను వాయిదా వేస్తే గ్రామా ల్లో పరిపాలన మరింత కష్టంగా మారనున్నది.
ఇప్పటికే సర్పంచుల పదవీకాలం ము గిసి ఏడాదిన్నర అవుతుంది. గ్రామ పంచాయతీల్లో పాలక మండలి లేక నిధులు మం జూరు జాప్యం జరుగుతుంది. ఈ క్రమంలో గ్రామాల్లో పాలన సజావుగా సాగడం లేదు. ఈ కారణంగా గ్రామాల అభివృద్ధి కుంటుపడుతున్నది. దీంతో వెంటనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి గ్రామాలకు నిధులు మంజూరు చేయాలని పెద్దఎత్తున డిమాం డ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదావేసే అవకాశం లేకుండాపోయింది.
వాస్తవానికి బీసీ రిజర్వేషన్ల అమలు చేసే ప్రక్రియ మొదలుపెట్టినప్పటి నుంచి కాం గ్రెస్ ప్రభుత్వం పార్టీ పరంగా రిజర్వేషన్ల అం శాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నది. రిజర్వేషన్లకు ఎలాంటి అడ్డంకులు తలెత్తినా పార్టీ పరంగానైనా బీసీలకు సీట్లు కేటాయిస్తామని సీ ఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే చాలాసార్లు ప్రకటించారు. కానీ పార్టీ పరంగా ఇచ్చే రిజర్వే షన్లను బీసీలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. ఆ రకంగా వర్తించే రిజర్వేషన్లతో బీసీలకు నష్ట మే తప్పా లాభం లేదని కుండబద్ధలు కొట్టినట్టు చెబుతున్నారు.
పార్టీ పరంగా టిక్కెట్లు ఇచ్చే క్రమంలో బీసీలకు ఓడిపోయే స్థానాలను కట్టబెడతారని ఆరోపిస్తున్నారు. దీంతో పాటు ఒక పార్టీ బీసీకి సీటు ఇచ్చి, వేరొక పార్టీ అగ్రవర్ణాలకు చెం దిన అభ్యర్థికి టిక్కెట్టు ఇస్తే, వారిని ఆర్థికంగా, రాజకీయంగా బీసీలు ఎదుర్కో గల రా అని ప్రశ్నిస్తున్నారు. బీసీలతో బీసీలే పో టీ పడాలని డిమాండ్ చేస్తున్నారు. రా జ్యాంగ సవరణ, చట్టబద్ధమైన రిజర్వేషన్లతో మాత్రమే ఇది సాధ్యమవుతుందని వాదిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మంచిదే అయినా బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్ అనివార్యమని స్పష్టం చేస్తున్నారు. బీసీలకు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చే ఆలోచన ఉన్నప్పటికీ చివరగా జీవో విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. న్యాయపరమైన సమస్యలు తలెత్తే క్రమంలో జీవో విడుదల చేసిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది.
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత న్యాయస్థానాలు జోక్యం చేసుకోవని భావిస్తున్నది. ఎవ రూ కోర్టుల్లో సవాల్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అనుకుంటున్నది. ఇందులో భాగంగా బీసీ రిజర్వేషన్ల అమలు కోసం వి డుదల చేసే జీవో అంశంపై అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించనున్నట్టు సమాచారం.
పార్టీపరంగా ఇస్తే బీసీలకు నష్టమే
బీసీలకు రిజర్వేషన్ చట్టబద్ధంగా కావాలి. పార్టీ పరంగా ఇస్తే మాకు న్యాయం జరగదు. పార్టీపరంగా అయితే ఇంతకాలం ఎందుకు, ఎప్పుడో ఇవ్వాల్సింది. ఒక పార్టీ ఇచ్చి, మరొక పార్టీ ఇవ్వకపోతే బీసీలకు పెద్దగా ప్రయోజనం ఉండదు. పార్టీ పరంగా రిజర్వేషన్లు బీసీలకు నష్టమే తప్ప, లాభం ఏమీ లేదు. తప్పనిసరిగా చట్టబద్ధంగానే రిజర్వేషన్లు ఇస్తేనే బీసీలకు రాజకీయ హక్కు దక్కుతుంది. పార్టీపరమైన రిజర్వేషన్ ఇచ్చినా బీసీల ప్రాతినిధ్యం పెరగదు. బీసీల విషయంలో అన్ని పార్టీలు రాజకీయ డ్రామాలు వేస్తున్నాయి. ఏ రాజకీయ పార్టీకి రిజర్వేషన్ అమలుచేయడంపై చిత్తశుద్ధి లేదు. బీజేపీ పెద్ద మోసకారి పార్టీ. కావాలనే రిజర్వేషన్‌కు మోకాలు అడ్డుతున్నది. ఇది అత్యంత దుర్మార్గం.
జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు
శాశ్వత పరిష్కారం కావాలి
పార్టీ పరంగా ఇచ్చే రిజర్వేషన్‌తో పెద్దగా ఒరిగేదేం లేదు. బీసీ అభ్యర్థులపై ఇతర పార్టీల నుంచి ఓసీలు గానీ, ఇండిపెండెంట్ ఓసీలు గానీ నిలబడతారు. దాని వల్ల బీసీలకే నష్టం. అందుకే రిజర్వేషన్లు చట్టబద్ధంగా కావాలి. పార్టీ పరంగా ఇవ్వకపోయిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ నష్టం ఏం జరగదు. బిల్లు, ఆర్డినెన్స్ తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఎందుకు నిర్వహించడం లేదు? అన్ని రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి, బీసీల రిజర్వేషన్‌పై నిర్ణయం తీసుకుని ప్రధానమంత్రిని ఒప్పించే మార్గంపై దృష్టి పెట్టాలి. లేకపోతే కులగణన, బీసీ రిజర్వేషన్ బిల్లు, ఆర్డినెన్స్ చిత్తు కాగితాలతో సమానం. బీసీ రిజర్వేషన్‌పై తాత్కాలిక పరిష్కారం వద్దు, శాశ్వత పరిష్కారం కావాలి.
టీ.చిరంజీవులు, మేధావుల ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్