calender_icon.png 30 July, 2025 | 1:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వంపై ఎన్‌హెచ్‌ఆర్సీకి బీఆర్‌ఎస్ ఫిర్యాదు

30-07-2025 12:08:13 AM

తెలంగాణలో రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నది

హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వంపై ఎన్‌హెచ్‌ఆర్సీకి బీఆర్‌ఎస్ ఫిర్యాదు చేసింది. తెలంగాణలో రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రాజ్యాంగాన్ని బహిరంగంగా ఉల్లంఘిస్తున్నదని పేర్కొన్నది. సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం చేసే వారిపై నిర్దాక్షిణ్యమైన దాడులు చేస్తోందంటూ ఫిర్యాదు చేసింది. మంగళవారం హైదరాబాద్‌లో సమావేశాలు నిర్వహిస్తున్న ఎన్‌హెచ్‌ఆర్సీ చైర్మన్ జస్టిస్ వి. రామసుబ్రమణియన్‌కు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, బీఆర్‌ఎస్ నేతలు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీఆర్‌ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్‌లు పిటిషన్ ఇచ్చారు.

వికారాబాద్ జిల్లా లగచెర్ల గ్రామంలో ఫార్మా విలేజ్ నిర్మాణం కోసం గిరిజనుల భూములను అక్రమంగా ఆక్రమించేందుకు ప్రయత్నించిందన్నారు. బీఆర్‌ఎస్ కార్యకర్తల ఫిర్యాదులను పోలీసులు  పట్టించుకోవడం లేదని, కేటీఆర్‌పై 15 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయని, వీటిలో చాలావరకు కోర్టులచే రద్దు చేశాయన్నారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలను, పౌరులను భయపెట్టడానికి అరెస్ట్ అధికారాలు, లుక్‌ఔట్ సర్క్యులర్ల (ఎల్‌ఓసీ) దుర్వినియోగం జరుగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

సోషల్ మీడియా పోస్ట్‌లు, రీట్వీట్‌లు చేసిన వారిని జైలుకు పంపుతున్నారని పేర్కొన్నారు. మంత్రులు, బ్యూరోక్రాట్‌లు, విపక్ష నాయకులపై, సొంత కేబినెట్‌లోని వారిపై కూడా నిఘా జరుగుతోందని, ఇది అంతర్గత రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అని ఫిర్యాదులో తెలిపారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో   సురక్షిత విద్యా వాతావరణాన్ని నిరాకరిస్తుందని ఫిర్యాదు చేశారు. అన్ని మానవ హక్కుల ఉల్లంఘనలపై సమగ్రమైన, స్వతంత్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

రాజకీయ లక్ష్యాలను ఆపడానికి పోలీసులకు బలమైన మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో పారదర్శక సంస్కరణలు, విద్యార్థులకు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రమాదాల నివారణ, విద్యార్థులతో బలవంతపు పనులు చేయించకూడదని, దర్యాప్తు వివరాల లీక్‌కు బాధ్యులైన అధికారులపై చర్యలు చేపట్టాలని, న్యాయమైన విచారణ హక్కునుగౌరవించాలని ఫిర్యాదులో బీఆర్‌ఎస్ నేతలు కోరారు.