30-07-2025 01:21:11 PM
రోడెక్కిన గురుకుల విద్యార్థులు
మధ్యలో అడ్డుకున్న పోలీసులు
అలంపూర్: జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం అలంపూర్ చౌరస్తా లోని మహాత్మ జ్యోతిరావు పూలే బాలుర పాఠశాల విద్యార్థులు బుధవారం ఉదయం రొడ్డెక్కారు. హాస్టల్లో పురుగుల అన్నం, ఉప్పు నీళ్లు, బాత్రూముల వంటి పలు సమస్యలపై ప్రిన్సిపాల్ కు పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థులు హాస్టల్ నుంచి గద్వాల వరకు ర్యాలీగా వెళ్లి తమ గోడు కలెక్టర్ చెప్పుకోవాలనుకున్నారు. పదవ తరగతికి చెందిన 56 మంది విద్యార్థులు 44వ జాతీయ రహదారిపై దాదాపు 8 కిలోమీటర్ల వరకు నడిచి వెళ్లారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఇటిక్యాల పాడు స్టేజి వద్ద అడ్డుకున్నారు. అల్లంపూర్ సిఐ రవిబాబు, ఉండవల్లి ఎస్సై శేఖర్ మానవపాడు ఎస్సై చంద్రకాంత్ విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను ఆరా తీశారు. ఉన్నత అధికారుల దృష్టికి మీ సమస్యను తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పిన విద్యార్థులు వినిపించుకోలేదు.దీంతో పోలీసులు డీసీఎంలో ఎక్కించి పాఠశాలకు చేర్చారు.
గురుకుల పాఠశాలను పరిశీలించిన అదనపు కలెక్టర్
హాస్టల్లో నెలకొన్న సమస్యలపై విద్యార్థులు రోడెక్కరన్న సమాచారం మేరకు అలంపూర్ చౌరస్తాలోని మహాత్మ జ్యోతి పూలే గురుకుల బాలుర పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. పురుగులు అన్నం పెడుతున్నారని విద్యార్థులకు సరిపడా బాత్రూం లేకపోవడంతో ఆరుబయటకు వెళ్తున్నామని అదనపు కలెక్టర్ కు మొరపెట్టుకున్నారు. అనంతరం అదనపు కలెక్టర్ నర్సింగరావు హాస్టల్ పరిసరాలను , వంటశాల, రూములను పరిశీలించారు. జరిగిన ఘటనపై ఉపాధ్యాయులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బందిని పిలిచి మాట్లాడారు. విద్యార్థులకు మెనూ ప్రకారమే నాణ్యమైన భోజనం అందించాలని , పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఉపాధ్యాయులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. మరొకసారి ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉపాధ్యాయులందరి సమన్వయంతో మంచి విద్యతోపాటు వసతి అందించాలని సూచించారు.