నేతన్నల ఆత్మహత్యలకు బీఆర్‌ఎస్ కారణం

27-04-2024 02:02:57 AM

l చేనేత పరిశ్రమను పట్టించుకోలేదు

l మేము వచ్చాక 50 కోట్ల బకాయిలు చెల్లించాం

l మిగతావి త్వరలోనే విడుదల చేస్తాం

l రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ 

హైదరాబాద్, ఏప్రిల్ 26( విజయక్రాంతి): చేనేత కార్మికుల ఆత్మహత్యలపై బీఆర్‌ఎస్ శవరాజకీయాలు చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. నేత కార్మికుల ఆత్మహత్యలకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణమని ఆయన ఆరోపించారు. శుక్రవారం గాంధీభవన్‌లో వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో కలిసి మాట్లాడుతూ..  కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలే అయిందని, తమ ప్రభు త్వం వల్లే ఆత్మహత్యలు చేసుకున్నారని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించడం సిగ్గుచేట న్నారు. కార్మికులు చేసిన పనులకు అప్పుడే డబ్బులు చెల్లించి ఉంటే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదన్నారు. నేతన్నల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే వారితో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు.

మొదటి దశలో రూ.50 కోట్లు పెండింగ్ బకాయిలు చెల్లించామని, త్వరలోనే మిగతావి విడుదల చేస్తామని చెప్పారు. తెలంగాణలో 40 వేల మరమగ్గాలు ఉంటే ఒక సిరిసిల్లలోనే 30 వేలు ఉన్నాయన్నారు. అటువంటి ప్రాంతాన్ని గత ప్రభుత్వం ఏమాత్రం అభివృద్ది చేయలేదని మంత్రి పొన్నం మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్‌ఎస్  అధికారంలో ఉన్నప్పటికీ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను పట్టించుకోలేదన్నారు. నేతన్నలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని, మీరందరు ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఆత్మహత్యలకు గల కారణాలను తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరినట్లు మంత్రి పేర్కొన్నారు. దేశంలో బీజేపీ గ్రాఫ్ పడిపోతుందని ప్రజల్లో విద్వేషాలు రెచ్చగోడుతుందన్నారు. రాముడి కల్యాణం తర్వాత అక్షింతలు వస్తాయని, కానీ ముందే బీజేపీ నేతలు అక్షింతలు పంపిణీ చేశారని మంత్రి వ్యాఖ్యానించారు. పదేళ్ల పాలనలో మోదీ ఒక్క హిందువుకూ లాభం చేయలేదని, కార్పొరేట్ వ్యవస్థలకే న్యాయం చేశారని ఆయన మండిపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దళితులు, బీసీల రిజర్వేషన్ల కోసం కులగణన చేస్తామన్నారు.