వచ్చే 5 రోజులు భానుడి ఉగ్రరూపం

27-04-2024 02:09:23 AM

l తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం 

l అత్యవసరమయితే బయటకు రండి

l వాతావరణ శాఖ హెచ్చరిక

l పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ 

హైదరాబాద్,ఏప్రిల్ 26(విజయక్రాంతి): రాష్ట్రంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. రానున్న 5 రోజు లు రాష్ట్రంలో వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. శుక్రవారం నుంచి వచ్చే ఐదు రోజులు రాష్ట్రంలో గరిష్ఠ  ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు నమోదు అయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా రానున్న మూడు రోజులు (28, 29, 30 తేదీలు) అధికంగా వడగాలులు వీచే ఆవకాశం ఉందని తెలిపింది. దీంతో పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లను జారీ చేసింది. ఈ నేపథ్యం లో అప్రమత్తంగా ఉండాలని, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య అత్యవసరమయితే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

శుక్రవారం మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జిగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రా ద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, కామారెడ్డి, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా శనివారం మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అకడక్కడ వేడిగాలులు వీచే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 28, 29 తేదీలలో నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగు లాంబ గద్వాల్ జిల్లాల్లో అధికంగా వడగాలు వీచే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. 28వ తేదీన మంచిర్యాల నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

29న కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి  కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 30న భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూ బాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్‌లో అత్యధికంగా 43 డిగ్రీలు (బంజారాహిల్స్ సర్కిల్ 18, జూబ్లీహిల్స్)లో అత్యల్పంగా 20 డిగ్రీలు రాజేంద్ర నగర్ (సర్కిల్ 11)లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. రాగల మూడు రోజుల్లో నగరంలో వాతావరణం పొడిగా ఉంటుందని, అత్యధిక ఉష్ణోగ్రత 40 నుంచి 42 డిగ్రీ లు, అత్యల్పంగా 26 నుంచి 28 డిగ్రీలు నమోదు అవుతుందని పేర్కొంది.