30-09-2025 09:46:06 PM
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి..
ముధోల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్తలు డాక్టర్ కిరణ్ కొమ్రేవార్, మాజీ జడ్పీ చైర్మన్ లోలం శ్యాంసుందర్..
కుభీర్ (విజయక్రాంతి): స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బ కొట్టి బీఆర్ఎస్ సత్తా చాటాలని ముధోల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్తలు డాక్టర్ కిరణ్ కొమ్రెవార్, ఉమ్మడి జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లోలం శ్యాంసుందర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో మండలంలోని 43 గ్రామపంచాయతీలలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు. రేవంత్ రెడ్డి సర్కారు మాయమాటలు చెప్పి దొడ్డిదారిన అధికారాన్ని కైవసం చేసుకుని ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను బుట్ట దాఖలు చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఇంటింటికి తెలియజేసేలా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఏ ఒక్క హామీని అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి ప్రజలను మోసం చేసి ఎన్నికల్లో సత్తాచాటాలని చూస్తుందని పేర్కొన్నారు. ఇందుకోసం పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ఎంపిటిసి జడ్పీటీసీలతో పాటు సర్పంచులను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందామని అన్నారు.
రాష్ట్ర ప్రజల్లో ఎక్కడ కూడా కేసీఆర్ వన్నె తగ్గలేదని, ఆయన పట్ల అమితమైన అభిమానం ప్రజల్లో చెక్కుచెదరకుండా ఉందన్నారు. దీన్ని టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సద్వినియోగం చేసుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలని పిలుపునిచ్చారు. రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని దీన్ని ప్రతి కార్యకర్త గడపగడపకు వివరించాలని సూచించారు. పార్టీ అభ్యర్థులను కలిసికట్టుగా ఎంపిక చేసుకుని ముందుకు సాగాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజలకు బకాయి పడ్డ హామీల కార్డులను ఆవిష్కరించారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. సిరిపెల్లి హెచ్ గ్రామంలో ప్రతిష్టించిన కర్ర దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులు ఎన్నిల అనిల్, రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ రేకుల గంగా చరణ్, మాజీ వైస్ ఎంపీపీ మోహియోద్దీన్, దొంతుల దేవిదాస్, గంధం పోశెట్టి, గడ్డం సంజీవ్, తిప్ప ఎర్రన్న, వడ్నం రవికుమార్, మాజీ సర్పంచ్లు జీ. రమేష్ (కుప్టి), గోరెక్కర్ బాబు, డాక్టర్ నరసింహులు, కందూర్ దత్తు, మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు, ఆయా గ్రామాల పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.