30-09-2025 09:02:07 PM
నవంబర్ 11 వరకు అమలులో ఎన్నికల కోడ్
జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
హనుమకొండ (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ సోమవారం విడుదలైన నేపథ్యంలో జిల్లాలోనూ ఎన్నికల ప్రవర్తన నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్) అమల్లోకి వచ్చిందని, నవంబర్ 11వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్(District Collector Sneha Shabarish) అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తన నియమావళిపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇచ్చిందని, షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సోమవారం నుండి నవంబర్ 11వరకూ ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందన్నారు. జిల్లాలో ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలు మొదటి దశలో ఆరు మండలాలు, 67 ఎంపీటీసీ స్థానాలకు, రెండో దశలో ఆరు మండలాలు, 62 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయన్నారు.
అదేవిధంగా గ్రామపంచాయతీలకు రాష్ట్రంలో మూడు దశల్లో ఎన్నికల నిర్వహిస్తుండగా హనుమకొండ జిల్లాలో రెండు, మూడో దశల్లో ఎన్నికలు జరుగుతాయన్నారు. జిల్లాలో 210 గ్రామపంచాయతీలు ఉండగా, వీటిలో 1986 వార్డు లు ఉన్నాయన్నారు. మొదటి దశలో 108 గ్రామపంచాయతీలకు, 1074 వార్డులకు, రెండో దశలో 102 గ్రామపంచాయతీలు, 912 వార్డులకు ఎన్నికలు జరుగుతాయన్నారు. జిల్లాలో మొత్తం ఓటర్లు 3లక్షల 70 వేల 871 మంది ఓటర్లు ఉండగా స్థానిక సంస్థల్లో ఓటు వేయనున్నారు. మొత్తం ఓటర్లలో పురుషులు 1,80, 000 మంది ఓటర్లు, మహిళలు 1,90,000 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలో 210 గ్రామ పంచాయతీలు ఉన్నాయన్నారు. ప్రతి 650 మంది ఓటర్ల గాను ఒక పోలింగ్ కేంద్రాన్ని కేటాయించినట్లు తెలిపారు. హనుమకొండ జిల్లాలో 1980 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల వారీగా ఇదివరకే ఓటర్ల జాబితా ప్రదర్శించడం జరిగిందని పేర్కొన్నారు.
మొదటి దశ శిక్షణ కార్యక్రమం ఇప్పటి వరకే పూర్తయ్యిందని, మిగిలిన అధికారులు, సిబ్బందికి రెండో విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికలు విధులకు తగినంత సిబ్బంది ఉన్నారని అన్నారు. గుజరాత్ నుండి పోలింగ్ బాక్స్ లను గత నెలరోజుల క్రితమే జిల్లాకు కేటాయించారని తెలిపారు. ప్లైయింగ్ స్క్వాడ్, ఎస్ ఎస్ టి బృందాలను నియమించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎన్నికల ప్రవర్తన నియమావళికి సంబంధించిన అంశాలను స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు నోడల్ అధికారి, పంచాయతీరాజ్ ఈఈ ఆత్మారామ్, కాజీపేట ఏసిపి ప్రశాంత్ రెడ్డి వివరించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, పరకాల ఆర్డిఓ డాక్టర్ నారాయణ, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, జడ్పీ సీఈవో రవి, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇ.వి. శ్రీనివాస్ రావు, కొలను సంతోష్ రెడ్డి, జి.ప్రభాకర్ రెడ్డి, కుసుమ శ్యాంసుందర్, ప్రవీణ్ కుమార్, నాగబెల్లి రజినీకాంత్, మంజుల మణి, ఎండి నేహాల్, కొట్టె ఏసోబు, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.