30-09-2025 08:55:22 PM
మందమర్రి (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం నూతనంగా తీసుకువచ్చిన భూ భారతి పోర్టల్ తో గత ఏడు సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోని భూ సమస్య పరిష్కారమైంది. ఈ మేరకు బాధితులు మంగళవారం వివరాలు వెల్లడించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని తిమ్మాపూర్ శివారులోని 163 సర్వే నెంబర్ లో 3.32 గుంటల భూమి రాధాకిషన్ రావు, నర్సింగ్ రావుల పేరిట జాయింట్ పట్టా ఉండగా 2018లో జాయింట్ పట్టాను విడదీసి రాధా కిషన్ రావు పేరిట మొత్తం భూమిని పట్టా మార్పిడి జరిగింది. దీనిని సరిచేయాలని కోరుతూ నరసింహ రావు వారసులు సంవత్సరాల తరబడి రెవెన్యూ కార్యాల చుట్టు తిరిగినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో 2020లో జిల్లా కలెక్టర్ కి సమస్య పరిష్కరించాలని కోరుతూ దరఖాస్తు చేసుకొన్నారు. దీనిపై విచారించిన జిల్లా కలెక్టర్ జాయింట్ పట్టాను యధాతధంగా అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం జాయింట్ పట్టాను అమలు చేయాలని కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని వారు తెలిపారు. ఇటీవల తమ భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ భూ భారతిలో బాధితులు దరఖాస్తు చేసుకోగా నూతన పోర్టల్ లో దరఖాస్తు వేసుకుంటే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని రెవెన్యూ అధికారులు సూచించడంతో అధికారుల సూచన మేరకు భూభారతి పోర్టల్లో తన భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులను జోడించి దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన రెవెన్యూ అధికారులు జాయింట్ పట్టాను యదాతదంగా అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకు వచ్చిన భూ భారతి పోర్టల్ తో రెవెన్యూ అధికారులు తనకు సంబంధించిన భూ సమస్యను పరిష్కరించారని, సమస్య పరిష్కారానికి కృషి చేసిన జిల్లా కలెక్టర్, మంచిర్యాల ఆర్డిఓ,మండల తహసీల్దార్, రెవెన్యూ అధికారులకు రెవెన్యూ అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.