calender_icon.png 26 January, 2026 | 6:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థిని మృతి వెనుక బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

26-01-2026 04:06:15 PM

గురుకుల పాఠశాల ముందు బైఠాయించి నిరసన తెలిపిన మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం ఎస్సీ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని సంగీత మృతి యాదృచ్ఛిక ఘటన కాదని, ఇది అధికారుల నిర్లక్ష్యం, అహంకారం, అక్రమాల ఫలితమని మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ తీవ్రంగా ఆరోపించారు. ఈ ఘటనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యులైన వారిని రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని మండిపడ్డారు. సోమవారం గురుకుల పాఠశాల గేటు ముందు విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి బీజేపీ నేతలు, కార్యకర్తలు బైఠాయించి ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఉద్ధృత నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా యెండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ప్రిన్సిపాల్ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాఠశాలకు చెందిన ఫర్నిచర్‌ను అక్రమంగా తరలించడం, రాత్రి వేళ విద్యార్థుల చేతే కుర్చీలు దిగుమతి చేయించడం నేరపూరిత చర్యలేనని స్పష్టం చేశారు. చిన్నారుల ప్రాణాలతో చెలగాటం ఆడిన ఈ ఘటనలో ప్రభుత్వ శాఖలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దుర్మార్గపు పాలనకు నిదర్శనమని దుయ్యబట్టారు.ఆటో నుంచి విద్యార్థినులు దూకుతున్న దృశ్యాలు బయటపడినా, ఇప్పటివరకు బాధ్యులపై కఠిన చర్యలు ఎందుకు లేవని ప్రశ్నించారు.

దోషులను కాపాడేందుకే దర్యాప్తును నీరుగారుస్తున్నారా? అధికార పార్టీ నేతల ఒత్తిడితోనే పోలీసులు మౌనంగా ఉన్నారా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రిన్సిపాల్‌ను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించి, ఈ ఘటనపై సీబీఐ లేదా న్యాయ విచారణకు ఆదేశించాల్సిందేనని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి 20 లక్షల ఎక్స్గ్రేషియా తో పాటు, ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించి, విద్యార్థిని మృతికి బాధ్యులైన వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైతే, బీజేపీ ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలల విద్యార్థుల భద్రత కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ ఘటనకు నిరసనగా బాన్సువాడ పట్టణంలో అఖిలపక్ష నాయకులతో కలిసి సుమారు గంటపాటు తీవ్ర ధర్నా నిర్వహించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీజేపీ కార్యకర్తలు, విద్యార్థుల తల్లిదండ్రులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి బాన్సువాడ పోలీస్ స్టేషన్‌కు తరలించడం పాలనా దమనకాండకు నిదర్శనమని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, బాన్సువాడ పట్టణ అధ్యక్షులు కోణాల గంగారెడ్డి, నసురుల్లాబాద్ మండల అధ్యక్షులు హన్మండ్లు యాదవ్, నాయకులు కొండని గంగారం, భూమేష్‌, కార్యకర్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు  పాల్గొన్నారు.