తీరు మార్చుకోనందుకే ఈ నిర్ణయం..
హైదరాబాద్: తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ మహిళా నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్(Former Minister Satyavathi Rathod) మాట్లాడుతూ.. పేగుబంధం కంటే పార్టీని నమ్ముకున్న కోట్లాది కార్యకర్తలకే కేసీఆర్(KCR) ప్రధాన్యం ఇచ్చారని, కన్నబిడ్డల కంటే పార్టీ ఎక్కువని ఈ నిర్ణయంతో కేసీఆర్ చాటిచెప్పారని సత్యవతి రాథోడ్ తెలిపారు. కవితకు ముందే హెచ్చరించినా.. తన తీరు మార్చుకోనందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. పార్టీ కంటే ఎవరూ ఎక్కువ కాదనే సందేశాన్ని కేసీఆర్ ఇచ్చారని, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో కోట్లమంది కలిసి నడిచారని అన్నారు. పార్టీకి జరుగుతున్న నష్టాన్ని నివారించాలని, కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతినకూడదని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.
కవిత మాటలు లక్షలాది కార్యకర్తలను బాధపెట్టాయని, పార్టీ పెట్టినప్పటి నుంచి కేసీఆర్ కు కుడిభుజంగా హరీష్ రావు ఉన్నారన్నారు. కొన్నాళ్లు కేటీఆర్ పై విమర్శలు చేశారు.. ఇప్పుడు హరీష్ రావుపై విమర్శలు చేశారని తెలిపారు. కవిత వెనుక ఎవరో ఉండి మాట్లాడిస్తున్నట్లు మాకు అనిపిస్తుందని, కవితకు మా నాయకుడు ఎన్నో అవకాశాలు ఇచ్చారని అన్నారు. ఒకసారి ఎంపీని చేశారు.. తర్వాత ఓడిపోయినా.. ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారని తెలిపారు. కేసీఆర్ కుమార్తెగా కవితకు పార్టీలో ఎంతో గౌరవం దక్కిందని, ఇవాళ అన్ని మర్చిపోయి పార్టీ గురించి చెడుగా మాట్లాడటం సరికాదని సత్యవతి రాథోడ్ అన్నారు. పార్టీ ఉంటే ఎంత.. పోతే ఎంత అని కవిత వ్యాఖ్యలు.. నువ్వుంటే ఎంత.. పోతే ఎంత అని కార్యకర్తలు అనుకుంటున్నారని తెలిపారు.






