స్కూల్ డైరెక్టర్ దారుణ హత్య
- ఆమె ఫోన్ తీసుకెళ్లిన దుండగులు
- సీసీటీవీ ఫుటేజ్ లో కీలక ఆధారాలు!
- నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో ఘటన
నల్లగొండ క్రైం, ఆగస్టు 12(విజయక్రాంతి) : నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం జేబీ కాలనీలో సోమవారం అర్ధరాత్రి ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మృతురాలు రూపారెడ్డి (45) కొండమల్లేపల్లిలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆమె భర్త హైదరాబాదులో ఉంటున్నారు. మంగళవారం రాత్రి భర్త రాజేందర్ రెడ్డి తన భార్య రూపారెడ్డికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది.
అనుమానం వచ్చి ఇంట్లో కిరాయికి ఉంటున్న వారికి తెలియజేయడంతో వారు వెళ్లి చూడగా ఇంటి తలుపులు లోపలి నుంచి వేసి ఉండడం గమనించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా రూపారెడ్డి మృతదేహం రక్తపు మడుగులో కనిపించింది. గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ఆధారాలు సేకరించాయి.ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి హత్య జరిగిందా? దోపిడీ కోసమా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ డాగ్ గోడ దూకి కొంత దూరం వెళ్లడం, తలపై బలమైన గాయాలు ఉండడం తో పోలీసుల కీలక ఆధారాలు సేకరించారు. దొంగలైతే ఒంటి మీద ఉన్న బంగారు గొలుసులు, ఇంట్లో ఆమె పర్సులో ఉన్న లక్ష రూపాయల నగదు అలాగే ఉంది.
ఆమె ఫోన్ మాత్రం దుండగులు ఎత్తుకెళ్లారు. ఆమె కుటుంబానికి వ్యక్తిగతంగా మంచి పేరు ఉన్నదని, ఇటు కుటుంబంలో అటు బయట సమాజంలో కూడా ఎవరితో వ్యక్తిగతంగా విభేదాలు లేవని స్థానికులు చెబుతున్నారు అయితే ఆమె భర్త రాజేందర్ రెడ్డి కూడా ఎవరితో విభేదాలు లేవని ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులు క్షణంగా పరిశీలిస్తున్నారు.






