మారుతి మోడల్స్‌ను మించిన టాటా పంచ్

08-05-2024 12:22:42 AM

న్యూఢిల్లీ, మే 7: తాజాగా దేశంలో మారుతి వాహన మోడల్స్‌ను టాటా మినీ ఎస్‌యూవీ మించిపోయింది. ఎంతోకాలం గా పాసింజర్ వాహన రంగంలో మారుతి ఆధిపత్యం చెలాయిస్తున్న సంగతి తెలిసిందే. వ్యాగన్‌ఆర్, స్విఫ్ట్, బ్రెజ్జా తదితర మారుతి మోడల్స్ అమ్మకాలను టాటా పంచ్ మించింది. దేశంలో ప్రస్తుతం అత్యధికంగా అమ్ముడుపోతున్న కారు ఇదే. 2024 మార్చి లో తొలిసారిగా ఈ ఫీట్ సాధించింది. ఆ నెలలో 16,368 మారుతి వ్యాగన్‌ఆర్‌లు విక్రయంకాగా, టాటా మోటార్స్ 17,547 పంచ్‌లను విక్రయించింది. ఈ నెలలో ఆశ్చర్యకరంగా హ్యుందాయ్ క్రెటా 16,458 యూనిట్ల విక్రయాలతో ద్వితీయస్థానంలో నిలిచింది. ఏప్రిల్ నెలలో సైతం ఇదే ట్రెండ్ కొనసాగింది. ఏప్రిల్‌లో 19,158 యూనిట్ల పంచ్ అమ్ముడుపోయాయి. 17,850 యూనిట్ల అమ్మకాలతో వ్యాగన్‌ఆర్ ద్వితీయస్థానంలో, 17,113 యూనిట్లతో బ్రెజ్జా తృతీయస్థానంలోనూ నిలిచాయి. పంచ్ పెట్రోల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వెర్షన్లలో లభిస్తున్నది. పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ.6.1 లక్షలుకాగా, ఎలక్ట్రిక్ వెర్షన్ ధర రూ. 11 లక్షల నుంచి ఉన్నది. 

టాప్ టెన్‌లో ఏడు మారుతి కార్లే

మారుతి మోడల్స్‌ను టాటా పంచ్ బీట్ చేసినప్పటికీ, భారత ఆటోమొబైల్ మార్కె ట్లో మారుతి సుజుకీయే నంబర్ వన్. దేశం లో అత్యధికంగా విక్రయమవుతున్న టాప్ 10 మోడల్స్‌లో ఏప్రిల్ నెలలో మారుతి మోడల్స్ ఏడు ఉన్నాయి. మార్చిలో ఈ సంఖ్య ఆరు.