న్యూఢిల్లీ: ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (Cabinet Committee on Economic Affairs ), మహారాష్ట్రలోని నాసిక్, షోలాపూర్, అక్కల్కోట్‌లను కలుపుతూ రూ. 19,142 కోట్ల మొత్తం వ్యయంతో ఆరు లేన్ల, ప్రవేశ నియంత్రిత గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. 374 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టును బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ (Build Operate Transfer) టోల్ మోడ్‌లో అభివృద్ధి చేస్తారు. ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ కింద భారత్ సమగ్ర రవాణా మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తూ ప్రాంతీయ, అంతర్-రాష్ట్ర కనెక్టివిటీని మెరుగుపరచడం దీని లక్ష్యమని కేంద్రం వెల్లడించింది. ప్రతిపాదిత కారిడార్ నాసిక్, అహమద్‌నగర్-షోలాపూర్ వంటి ప్రధాన ప్రాంతీయ కేంద్రాలను కలుపుతుంది. అక్కడి నుండి కర్నూలుకు కూడా అనుసంధానం ఉంటుంది. దీనిని వధావన్ పోర్ట్ ఇంటర్‌ఛేంజ్ సమీపంలో ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేతో(Delhi-Mumbai Expressway), నాసిక్ వద్ద ఆగ్రా-ముంబై కారిడార్‌తో పాంగ్రి సమీపంలో సమృద్ధి మహామార్గ్‌తో సహా కీలక జాతీయ రహదారులు ఎక్స్‌ప్రెస్‌వేలతో అనుసంధానించడానికి ప్రణాళిక రూపొందించబడింది. ఈ కారిడార్ పూర్తయిన తర్వాత, ఇది పశ్చిమ భారత్ , తూర్పు తీరాల మధ్య నిరంతరాయ అనుసంధానాన్ని అందిస్తోంది.
ప్రభుత్వం ప్రకారం, ఈ ప్రాజెక్టు ప్రయాణ సమయాన్ని సుమారు 17 గంటలు, ప్రయాణ దూరాన్ని దాదాపు 201 కిలోమీటర్లు కుదించడం ద్వారా ప్రయాణ సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. ఇది కొప్పర్తి-ఓర్వకల్ వంటి ప్రధాన నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఐసిడిసి) కేంద్రాలకు సంబంధించిన సరుకు రవాణాకు లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. ఈ ప్రాజెక్టులోని నాసిక్-తలేగావ్ దిఘే సెక్షన్, ఎన్‌ఐసిడిసి గుర్తించి, మహారాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తున్న పుణె-నాసిక్ ఎక్స్‌ప్రెస్‌వే(Pune-Nashik Expressway) అవసరాన్ని కూడా తీరుస్తుంది. అధిక వేగంతో, నియంత్రిత ప్రవేశం ఉండే కారిడార్‌గా రూపొందించబడిన ఈ రహదారి గంటకు 100 కిలోమీటర్ల వరకు డిజైన్ వేగంతో, సగటున గంటకు 60 కిలోమీటర్ల వాహన వేగానికి మద్దతిస్తోంది. ఈ ప్రాజెక్టుతో రద్దీ తగ్గుతుందని, రహదారి భద్రత మెరుగుపడుతుందని, నిర్వహణ ఖర్చులు తగ్గుతాయని, ప్రయాణీకుల, సరుకు రవాణాకు నిరంతరాయ రాకపోకలు సాధ్యమవుతాయని భావిస్తున్నారు. మొత్తం ప్రయాణ సమయం 31 గంటల నుండి సుమారు 17 గంటలకు, అంటే దాదాపు 45 శాతం మేర తగ్గుతుందని అంచనా వేయబడింది. నాసిక్, అహిల్యానగర్, ధారాశివ్, సోలాపూర్ జిల్లాలలో ప్రాథమిక మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా ఈ కారిడార్ ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికి కూడా దోహదపడుతుందని కేంద్రం వెల్లడించింది.