20న క్యాబినెట్ సమావేశం
ఆ తర్వాత అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
రేపు ఉగాది, 21, 22 తేదీల్లో రంజాన్, 27న శ్రీరామనవమి సెలవులు
హైదరాబాద్, మార్చి17(విజయక్రాంతి) : తెలంగాణ క్యాబినెట్ సమావేశం ఈ నెల 20న జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం ఉదయం 9.30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో మంత్రివర్గ భేటీ కాబోతోంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కె. రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు..బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.
దీంతో పాటు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల పనిదినాలపై బీఏసీలో తీసుకున్న నిర్ణయాలను అసెంబ్లీ కార్యదర్శి వెల్లడించారు. ఈ నెల 16న అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం కాగా, 17, 18 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదా తీర్మానాలు, సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సంబంధిత మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు.
19న అసెంబ్లీకి ఉగాది సెలవు ప్రకటించారు. 20న బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం 21, 22 తేదీల్లో రంజాన్ సెలవులను ప్రకటించారు. 23 నుంచి 26 వరకు పద్దులపై చర్చ, 27న అసెంబ్లీకి శ్రీరామనవమి సందర్భంగా సెలవు ప్రకటిం చారు. 28, 29 తేదీల్లో డిమాండ్స్, గ్రాంట్ చర్చ, 30న ద్రవ్య వినిమయ బిల్లు, ప్రభుత్వ బిల్లులపై చర్చించి సభ ఆమోదించనుంది.




