calender_icon.png 1 January, 2026 | 3:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షమీకి పిలుపు?

01-01-2026 01:50:42 AM

కివీస్‌తో సిరీస్‌కు ఛాన్స్

దేశవాళీలో అదరగొడుతున్న వెటరన్

9 నెలలుగా టీమిండియాకు దూరం

బుమ్రాకు రెస్ట్ ఇచ్చే షమీకే ఛాన్స్

*మహ్మద్ షమీ.. టీమిండియాలో ఒకప్పుడు కీలక బౌలర్.. అయితే ఫిట్‌నెస్ సమస్యలు, యువ బౌలర్ల ఎంట్రీతో క్రమంగా జాతీయ జట్టుకు దూరమయ్యాడు. గంభీర్ కోచ్‌గా వచ్చిన తర్వాత అసలు అతని పేరును కూడా సెలక్టర్లు చర్చించడం మానేశారు. దీనిపై బహిరంగంగానే విమర్శలు గుప్పించడం.. దేశవాళీలో రాణిస్తున్న అతన్ని పక్కనపెట్టడంతో అగార్కర్‌పై మాజీలు సైతం అసంతృప్తి వ్యక్తం చేయడం.. ఫిట్‌గా లేకపోవడంతోనే ఎంపిక చేయలేదంటూ అతను సమర్థించుకోవడం.. దీనికి షమీ కూడా కౌంటర్ ఇవ్వడం వంటివి జరిగాయి. సెలక్టర్లు పక్కన పెట్టినా దేశవాళీలో తన ప్రదర్శనలతోనే వారికి సవాల్ విసిరాడు. ఇప్పుడు తనను ఖచ్చితంగా ఎంపిక చేయాల్సిన పరిస్థితిని కల్పించాడు. దీంతో షమీకి న్యూజిలాండ్‌తో సిరీస్‌కు చోటు దక్కుతుందని వార్తలు వస్తున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే వన్డే వరల్డ్‌కప్ 2027 కూడా అతన్ని పరిగణలోకి తీసుకోవచ్చు.

ముంబై, డిసెంబర్ 31: భారత క్రికెట్ జట్టులో ఇప్పుడు అంతా యువ ఆటగాళ్లదే హవా.. ముఖ్యంగా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎక్కువ శాతం యువ క్రికెటర్లకే జట్టులో ప్రాధాన్యత దక్కుతోంది. ఈ క్రమంలోనే స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సైతం టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది. అటు బౌలింగ్‌లోనూ జట్టులో ఎక్కువ మంది యువ పేసర్లకే చోటు దక్కుతోంది. దీంతో సీనియర్ పేసర్లలో బుమ్రా, సిరాజ్ తప్పి స్తే మిగిలిన వారికి నిరాశే మిగులుతోంది.

సీనియర్ పేసర్ మహ్మద్ షమీ విషయంలో ఇదే జరిగింది. దాదాపు 9 నెలలుగా జాతీయ జట్టుకు అతను దూరమయ్యాడు. ఫిట్‌నెస్ సమస్యలు కూడా ప్లేస్ లేకపోవడానికి కారణమ య్యాయి. సహజంగానే ఫాస్ట్ బౌలర్లకు గాయా లు, ఫిట్‌నెస్ సమస్యలు వెంటాడుతూనే ఉంటా యి. షమీ ఫిట్‌నెస్ సమస్యలను అధిగమించి దేశవాళీలో రాణిస్తున్నా సెలక్టర్లు గత కొంతకాలంగా పట్టించుకోవడం లేదు. దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ వెటరన్ పేసర్‌కు మళ్లీ పిలుపు దక్కనున్నట్టు సమాచారం. కివీస్‌తో వన్డే సిరీస్‌కు అతని ఎంపిక చేస్తారని వార్తలు వస్తున్నాయి.

ఆ గాయమే పెద్ద దెబ్బ 

2023 వన్డే ప్రపంచకప్‌లో షమీ అద్భుతంగా రాణించాడు. ఆ మెగా టోర్నీలో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అయితే తర్వాత చీలమండ గాయంతో ఇబ్బంది పడడం, సర్జరీ చేయించుకోవడం.. ఈ కారణంగా ఏడాది పాటు ఆటకు దూరమయ్యాడు. అదే సమయంలో యువ పేసర్లు జట్టులోకి రావడంతో షమీని మెల్లిగా సైడ్ చేసేసారు. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చిన షమీ ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఎంపికయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో రాణించినా తర్వాత సెలక్టర్లు అతన్ని పట్టించుకోలేదు. ఇక ఐపీఎల్ 2025 సీజన్‌లో ఘోరంగా విఫలమవడంతో జాతీయ జట్టు ఎంపికలో పరిగణలోకి కూడా రాకుండా పోయాడు. ఇంగ్లాం డ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా సిరీస్‌లకు సైతం అతన్ని ఎంపిక చేయలేదు.

దీంతో ఈ బెంగాల్ పేసర్ కెరీర్ ముగిసినట్టేనని అంతా భావించారు. ఫిట్‌నెస్‌తో లేని కారణంగానే ఎంపిక చేయలేదంటూ బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ చేసిన కామెంట్స్‌కు షమీ ఆటతో పాటు మాటతోనూ కౌంటర్ ఇచ్చాడు. తాను ఫిట్‌గా లేకుంటే రంజీలు ఎలా ఆడతానంటూ ఎదురు ప్రశ్నించాడు. అంతేకాదు రంజీ ట్రోఫీలో బెంగాల్ తరపున బరిలోకి దిగి అద్భుత ప్రదర్శనలతో చెలరేగిపోయాడు. 20 వికెట్లతో సెలక్టర్లకు సవాల్ విసిరాడు. ఈ క్రమంలో అతన్ని పక్కన పెట్టడంపైనా, అగార్కర్ చెప్పిన ఫి ట్‌నెస్ కారణంపైనా విమర్శలు వెల్లువెత్తాయి. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూ లీ సైతం షమీకి అండగా నిలిచాడు. సెలక్టర్ల తీరును పరోక్షంగా విమర్శించాడు.

పైగా దేశవాళీ ప్రదర్శనలతోనే జట్టును ఎంపిక చేస్తున్నామంటూ పదేపదే చెబుతున్నా అగార్కర్, గంభీర్‌లను షమీ డిఫెన్స్‌లో పడేశాడు. ఇటీవల భారత పేస్ బౌలింగ్ బుమ్రా లేకుంటే బలహీన పడిందన్న అభిప్రాయం కూడా షమీ వైపు మళ్లీ చూసే లా చేసినట్టు పలువురు భావిస్తున్నారు. రంజీ ట్రోఫీ మాత్రమే కాదు తర్వాత జరిగిన స య్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీలోనూ షమీ అదరగొట్టాడు. దీంతో సెలక్టర్లు వచ్చే న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు అతన్ని ఎంపిక చేసే అవకాశాలున్నాయి. 

ఫిట్‌నెస్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వెటరన్ పేసర్ రీఎంట్రీ ఇవ్వడం ఖాయం. ఈ సీనియర్ పేసర్ ఇప్పటి వరకూ 64 టెస్టుల్లో 229 , 108 వన్డేల్లో 206 , 25 టీ ట్వంటీల్లో  27 వికెట్లు తీశాడు.  కివీస్‌తో సిరీస్‌లో చెలరేగితే 2027 వన్డే ప్రపంచకప్ ప్రాబబుల్స్‌లోనూ అతన్ని పరిగణలోకి తీసుకునే ఛాన్సుంది. అప్పటికి 37వ ఏట అడుగు పెట్టనున్న షమీ తన ఫిట్‌నెస్ కాపాడుకుంటే మాత్రం మెగాటోర్నీలో కీలకమవుతాడని చెప్పొచ్చు. అటు టెస్టుల్లో చివరిసారి 20 23 డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడిన షమీ తర్వా త రెడ్ బాల్ క్రికెట్‌లో కనిపించలేదు. ఇక టీ20ల్లో చివరిసారిగా 2025 ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో ఆడాడు.