01-01-2026 02:00:06 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 31 (విజయక్రాంతి): తెలంగాణలో అవినీతిని కూకటివేళ్లతో పెకిలించడమే లక్ష్యంగా 2025లో అవినీతి నిరోధక శాఖ పంజా విసిరింది. ప్రభుత్వ కార్యాలయాల్లో పేరుకుపోయిన అవినీతిని ప్రక్షా ళన చేసే దిశగా ఈ ఏడాది రికార్డుస్థాయి ఆపరేషన్లు జరిగాయి. చిన్నపాటి క్లర్క్ మొదలుకొని గెజిటెడ్ అధికారుల వరకు ఎవరినీ వదలకుండా ఏసీబీ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఫలితంగా 2025 సంవత్సరం అవినీతి అధికారుల పాలిట సింహస్వప్నంగా మారింది.
ఈ మేరకు ఏసీబీ పనితీరు, నమోదైన కేసులు, సాధించిన ఫలితాలకు సంబంధించిన 2025 వార్షిక నివేదిక వివరాలను ఏసీబీ డైరెక్టర్ జనరల్ డీజీ చారు సిన్హా వెల్లడించారు. 2025లో ఏసీబీ దూకుడు మునుపెన్నడూ లేని విధంగా సాగింది. ఏడాది కాలంలో మొత్తం 199 కేసులు నమోదు కాగా, ఏకంగా 273 మందిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఇందులో నేరుగా లంచం తీసుకుంటూ పట్టుబడిన ట్రాప్ కేసులే 157 ఉండటం గమనార్హం.
ఈ ట్రాప్ కేసుల్లో మొత్తం 224 మంది నిందితులను అరెస్టు చేయగా, అందులో 176 మంది ప్రభుత్వ ఉద్యోగులే కావడం వ్యవస్థలోని డొల్లతనాన్ని బయటపెట్టింది. అలాగే క్రిమినల్ మిస్ కండక్ట్ కింద మరో 26 కేసులు నమోదు చేసి 34 మందిని అరెస్ట్ చేశా రు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడు తూ, ప్రజల సొమ్మును అక్రమంగా వెనకేసుకున్న అధికారుల ఆస్తుల చిట్టాను ఏసీబీ బట్టబయలు చేసింది.
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై నమోదైన 15 కేసుల్లోనే సుమారు రూ. 96,13, 50,554 విలువైన ఆస్తులను గుర్తించడం 2025 హైలైట్‌గా నిలిచింది. ఇవి కేవలం ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువల ప్రకారమే కాగా, బహిరంగ మార్కెట్లో వీటి విలువ వందల కోట్లలో ఉండే అవకాశం ఉంది. 158 ట్రాప్ కేసుల్లో అధికారులు డిమాండ్ చేసిన రూ. 57,17,500 లంచం నగదును సీజ్ చేశారు.
ఇందులో కోర్టు అనుమతులతో రూ.35,89,500 మొత్తాన్ని తిరిగి ఫిర్యాదుదారులకు బాధితులకు ఇప్పించి ఏసీబీ వారిలో ధైర్యాన్ని నింపింది. ఏడాది పొడవునా 54 ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, లోపాలను ఎత్తిచూపడంతో పాటు 26 రెగ్యులర్ ఎంక్వైరీలను చేపట్టింది. విచారణ పూర్తయిన కేసుల్లో ప్రభుత్వాన్ని ఒప్పించి 115 శాంక్షన్ ఆర్డర్స్ ప్రాసిక్యూషన్ అనుమతులు పొందడం ఏసీబీ వేగానికి నిదర్శనం.
టెక్నాలజీతో చెక్.. క్యూఆర్ కోడ్ విప్లవం..
అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు ప్రజ లు భయపడకూడదన్న ఉద్దేశంతో డిసెంబర్ మొదటి వారంలో డీజీ చారుసిన్హా క్యూఆర్ కోడ్ వ్యవస్థను ప్రారంభించారు. మారుమూల ప్రాంతాల ప్రజలు కూడా స్మార్ట్ ఫోన్ ద్వారా సులభంగా, మధ్యవర్తులు లేకుండా ఫిర్యాదు చేసేలా దీన్ని రూపొందించారు. అలాగే సిబ్బందికి బినామీ ఆస్తుల చట్టం, డిజిటల్ ఫింగర్‌ప్రింట్స్ ఆధునిక నిఘా పద్ధతులపై ప్రత్యేక శిక్షణ ఇప్పించినట్లు డీజీ తెలిపారు.