calender_icon.png 1 January, 2026 | 4:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలకు కొత్తపొద్దు!

01-01-2026 02:27:18 AM

నడుస్తున్న కాలంపై అధికారాన్ని ముద్దాడనున్న బీసీ బిడ్డలు

తెరలు తొలగుతున్న రాష్ట్ర రాజకీయాలు!

* రాజకీయ వ్యూహాత్మకంగా చూస్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడిగా ప్రొజెక్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్నట్టు కనిపిస్తోంది. దీని ద్వారా కులాల ఆధారంగా ఓటర్లను ధ్రువీకరించి రాజకీయ లాభం పొందాలనే ప్రయత్నం జరుగుతున్నదన్న అభిప్రాయం ఉంది.

రాష్ట్ర జనాభాలో కేవలం 6 నుంచి 8 శాతం మాత్రమే ఉన్నప్పటికీ, రెడ్డి సామాజిక వర్గం చారిత్రకంగా రాజకీయాలు, వ్యాపారం, భూముల విషయంలో కీలక పాత్ర పోషించింది. ఇటీవల రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తే, బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యంగా ఆయన ఎలాంటి రాజీలకైనా సిద్ధంగా ఉన్నారన్న భావన వ్యక్తమవుతోంది. అవసరమైతే ఇతర పార్టీలతో పరోక్ష ఒప్పందాలు చేసుకోవడానికైనా వెనుకాడని ధోరణి కనిపిస్తోంది. 

* పార్టీపై కుటుంబపాలన అన్న విమర్శలు తగ్గించేందుకు, రెడ్డి, బీసీ, మహిళలు, ఎస్సీలకు చెందిన నేతలకు బీఆర్‌ఎస్ తన  కమిటీల్లో, బహిరంగ వేదికలపై ప్రాధాన్యం ఇస్తోంది. 2014 నుంచి 2023 వరకు తమ పాలనా అనుభవం, ఆర్థిక బలం, ప్రసంగ నైపుణ్యాన్ని నమ్ముకుని బీఆర్‌ఎస్ ముందుకు సాగుతోంది. ఇటీవల కేటీఆర్.. రేవంత్‌రెడ్డితో ఫుట్‌బాల్ ఆడతా అనే వ్యాఖ్య కాంగ్రెస్ ప్రభుత్వంపై దూకుడు రాజకీయాలకు నిదర్శనం.

* మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్.. బండి సంజయ్‌కుమార్ వంటి నేత లతో ఉన్న విభేదాల నేపథ్యంలో కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం జరిగింది. అయితే సెప్టెంబర్‌లో ఆయన ఈ వార్తలను ఖండిస్తూ బీజేపీకే విధేయంగా ఉంటానని ప్రకటించారు. అయినా భవిష్యత్తులో ఆయన పార్టీనుంచి బయటకు వెళ్లి రెడ్డి వర్గానికి చెందిన నేతలతో కలిసి కొత్త రాజకీయ ప్రయోగం చేస్తే, బీసీ ఓట్లు గణనీయంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనావేస్తున్నాయి.

నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్న వేళ.. తెలంగాణ ప్రజలకు, విజయక్రాంతి పాఠకులకు, రాజకీయ పార్టీల నాయకులకు శాంతి సౌభాగ్యాలు సమకూరాలని మనసారా కోరుకుంటున్నాను. 

కొత్త సంవత్సరం 2026 చాలా కీలకమైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రెండేళ్లు పూర్తిచేసుకుంది. హనీమూన్ ముగిసింది. 2028లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అయితే, పార్లమెంట్ ఎన్నికలు కలిపి ౨౦౨౮లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగే వీలుం ది. మళ్లీ ఎన్నికలకు రెండేళ్ల సమయమున్నా, పార్టీలు ఇప్పటికే తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. పొత్తులకు కసరత్తులు చేస్తున్నాయి. తుఫాన్‌ల ఉన్న ఈ రాజకీయ వాతావ రణంలో రాష్ట్రంలోని బీసీలు ఒక నిర్ణయాత్మక శక్తిగా మారారు.

2021 కులగణన ప్రకారం తెలంగాణ జనాభాలో 50 శాతం కంటే ఎక్కువ ఉన్న బీసీలు, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి రాజకీయాల వరకు ప్రభావం చూపుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి రెండేళ్లలో కొన్ని విజయాలు, కొన్ని సవాళ్లను ఎదుర్కొంది. ఆరు గ్యారంటీల్లో భాగంగా రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. అయి తే రైతు భరోసా నిధుల చెల్లింపుల్లో ఆల స్యం, ఉద్యోగ హామీలు నెరవేరకపోవడం వంటి కారణాలతో విమర్శలు వెల్లువెత్తాయి.

2025లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుచేయాలని ప్రభు త్వం నిర్ణయం తీసుకుంది. ఇది బీసీలకు రాజకీయంగా బలమిచ్చిందని అనేకమంది అభినం దించినప్పటికీ, ప్రతిపక్షాలు దీనిని ఎన్నికల కోసం తీసుకున్న నిర్ణయంగా విమర్శించాయి. సెప్టెంబర్‌లో ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా ఈ రిజర్వేషన్ అమలులోకి వచ్చింది.

దీని వల్ల పంచా య తీలు, మున్సిపాలిటీల్లో బీసీలకు తగిన ప్రాతి నిధ్యం కల్పించాలనే లక్ష్యం పెట్టుకున్నా రు. అయితే అక్టోబర్‌లో రిజర్వేషన్ పంపిణీపై వివాదాలు తలెత్తాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, బంద్‌లు జరిగాయి. ఈ ఉద్యమాలకు బీఆర్‌ఎస్, బీజేపీలు మద్దతు ఇవ్వడం వల్ల కుల ఉద్రిక్తతలు మరింత బయటపడ్డాయి. 

సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి పరంగా వెనుకబడ్డామని బీసీ వర్గాల్లో దశాబ్దాలుగా అసంతృప్తి కొనసాగుతూ వస్తున్నది. అయితే ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే రాజకీయాల్లో బీసీలకు సానుకూల పరిస్థితులు రానున్నట్టు స్పష్టమవుతున్నది. భవిష్యత్‌లో రాజకీయంగా బీసీలు కీలకంగా మారుతున్నారు. వాస్తవానికి మొత్తం జనాభాలో సగాని కి పైగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు బీసీలకు రాజకీయంగా తగిన ప్రాధాన్యత లభించలేదు.

కానీ ప్రస్తుతం అధికార పార్టీ అయిన కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలైన బీఆర్‌ఎస్, బీజేపీలు.. బీసీల ఓట్లపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. భవిష్యత్ ఎన్నికల్లో బీసీలే గెలుపును నిర్ణయించే అవకాశం లేకపోలేదు. దీనికి తోడు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ రోజురోజుకూ పుంజుకుంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ బీసీ వైపు ప్రధానంగా దృష్టి సారించింది. బీసీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల కల్లా బీసీ వర్గాలను మరింత ఆకర్షించి బీఆర్‌ఎస్‌ను ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రానివ్వకూడదని సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తున్నది.

అటు బీఆర్‌ఎస్ పార్టీ కూడా అధికార పార్టీ పరిపాలనా లోపం, హామీల అమలులో జాప్యం, నీటి వాటా హక్కు సాధించడంలో వెనుకబాటును ఎత్తిచూపడంతోపాటు బీసీల అంశాన్ని కూడా ప్రధాన ఎజెండా తీసుకుంటున్నది. ఇటు బీజేపీ కూడా తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి వచ్చే లక్ష్యంతో బీసీ నేతనే సీఎం అభ్యర్థిగా ప్రకటించే యోచనలో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆయా పార్టీల రాజకీయ ఎత్తుగడలను పరిశీలిస్తే రాబోయే రోజు ల్లో బీసీలు ఎంత కీలకం కానున్నారో స్పష్టమవుతున్నది.

ఇదిలాఉండగా రాజకీయంగా బీసీల ప్రాధాన్యత పెరిగిందనడానికి ఇటీవల పంచాయతీ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12 వేలకుపైగా పంచాయతీ లు ఉండగా అందులో దాదాపు 5 వేల పంచాయతీలను బీసీలే గెలుచుకున్నారు. దీంతో బీసీల ప్రభా వం గుర్తించిన అన్ని పార్టీలు ఆ వర్గాల ప్రజలను ఆకర్షించడంపై దృష్టి సారిస్తున్నాయి. ఈ క్రమంలో బీసీల కోరుకునే రాజకీయ ప్రాధాన్యత పొందేందుకు ముందడుగు పడుతున్నట్టు స్పష్టంగా తెలుస్తున్నది. 

రెడ్డి వర్సెస్ బీసీ రాజకీయం..

రాజకీయ వ్యూహాత్మకంగా చూస్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడిగా ప్రొజెక్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్నట్టు కనిపిస్తోంది. దీని ద్వారా కులాల ఆధారంగా ఓటర్లను ధ్రువీకరించి రాజకీయ లాభం పొందాలనే ప్రయత్నం జరుగుతున్నదన్న అభిప్రా యం ఉంది. రాష్ట్ర జనాభాలో కేవలం 6 నుంచి 8 శాతం మాత్రమే ఉన్నప్పటికీ, రెడ్డి సామాజిక వర్గం చారిత్రకంగా రాజకీయాలు, వ్యాపారం, భూముల విషయంలో కీలక పాత్ర పోషించింది.

ఇటీవల రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తే, బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యంగా ఆయన ఎలాంటి రాజీలకైనా సిద్ధంగా ఉన్నారన్న భావన వ్యక్తమవుతోంది. అవసరమైతే ఇతర పార్టీలతో పరోక్ష ఒప్పందాలు చేసుకోవడానికైనా వెనుకాడని ధోరణి కనిపిస్తోంది.

ఒక రాజకీయ విశ్లేషకుడు చెప్పినట్టుగా, కాం గ్రెస్ గెలవాలన్న దానికంటే బీఆర్‌ఎస్ ఓడిపోవాలన్నదే రేవంత్ ఆలోచనగా మారినట్టు ఉంది. ఈ పరిస్థితి భవిష్యత్తులో రెడ్డి వర్సెస్ బీసీ రాజకీయానికి దారితీసే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి పోటీ చేస్తే, కాంగ్రెస్‌కు వ్యతిరే కంగా ఉన్న ఓట్లు చీలిపోయి, బహుముఖ పోటీల మధ్య బీఆర్‌ఎస్‌కు అనుకోకుండా లాభం కలగవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

పుంజుకుంటున్న బీఆర్‌ఎస్..

ఇదే సమయంలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ పార్టీ తిరిగి పుంజుకునే ప్రయత్నాల్లో ఉంది. కృష్ణా నది నీటి పంపకాల విషయంలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలో ఆంధ్రప్రదేశ్ వల్ల తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ప్రధానంగా ఎత్తిచూపుతోంది. పార్టీపై కుటుంబపాలన అన్న విమర్శలు తగ్గించేందుకు, రెడ్డి, బీసీ, మహిళలు, ఎస్సీలకు చెందిన నేతలకు బీఆర్‌ఎస్ తన  కమిటీల్లో, బహిరంగ వేదికలపై ప్రాధాన్యం ఇస్తోంది.

కేటీఆర్, హరీశ్‌రావు వంటి సీనియర్ నేతలు ఈ పోరాటానికి ముందుండి నడిపిస్తున్నారు. 2014 నుంచి 2023 వరకు తమ పాలనా అనుభవం, ఆర్థిక బలం, ప్రసంగ నైపుణ్యాన్ని నమ్ముకుని బీఆర్‌ఎస్ ముందుకు సాగుతోంది. ఇటీవల కేటీఆర్.. రేవంత్‌రెడ్డితో ఫుట్‌బాల్ ఆడతా అనే వ్యాఖ్య కాంగ్రెస్ ప్రభుత్వంపై దూకుడు రాజకీయాలకు నిదర్శనం. సాగునీటి ప్రాజెక్టులు పూర్తికాకపోవడం, యు వతకు ఉద్యోగాలు లేకపోవడం వంటి అంశాలను బీఆర్‌ఎస్ తీవ్రం గా విమర్శిస్తోంది.

2025 గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు బీఆర్‌ఎస్ ఇంకా బలంగా ఉందని సూచి స్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 7 వేలకుపైగా సర్పంచ్ స్థానా లు గెలుచుకున్నప్పటికీ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో బీఆర్‌ఎస్ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులు బలమైన ఆధిపత్యం చూ పించారు. ఇది ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న ప్రాంతాల్లో బీఆర్‌ఎస్ మళ్లీ పుంజుకుంటోందన్న సంకేతంగా రాజకీయవర్గాలు భావి స్తున్నాయి.

బీజేపీలో అంతర్గత రాజకీయాలు..

తెలంగాణలో ఇంకా పూర్తిగా పట్టు సాధించలేకపోయిన బీజేపీ, ఎన్నికలకు దగ్గరయ్యే కొద్దీ ఒక్కసారిగా దూసుకొచ్చే అవకా శాలు ఉన్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన 8 ఎంపీ సీట్లు పార్టీకి బలంగా మారాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఆకర్షణీయమైన నాయకత్వం, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యూహాత్మక నిర్వహణ, ఆర్‌ఎస్‌ఎస్ మద్దతుతో ఉన్న హిందూ భావజాలం వంటివి బీజేపీకి బలం. ప్రాంతీయ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చామని చెప్పడం, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలుచేయలేదని విమర్శించడం బీజేపీ ప్రధాన అజెండాగా మారింది.

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరిగితే జాతీయ స్థాయిలో వచ్చే ప్రభావం బీజేపీకి మరింత అనుకూలంగా మారే అవకాశం ఉంది. అయితే పార్టీ అంతర్గత రాజకీయాలు బీజేపీకి సవాళ్లుగా మారుతున్నాయి. మల్కా జ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్.. బండి సంజయ్‌కుమార్ వంటి నేతలతో ఉన్న విభేదాల నేపథ్యంలో కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం జరిగింది.

అయితే సెప్టెంబర్‌లో ఆయన ఈ వార్తలను ఖండిస్తూ బీజేపీకే విధేయంగా ఉంటానని ప్రకటించారు. అయినా భవిష్యత్తులో ఆయన పార్టీనుంచి బయటకువెళ్లి రెడ్డి వర్గానికి చెందిన నేతలతో కలిసి కొత్త రాజకీయ ప్రయోగం చేస్తే, బీసీ ఓట్లు గణనీయంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనావేస్తున్నాయి. 

బీసీల పాత్రే కీలకం..

ఈ పరిస్థితుల మధ్య బీసీల స్పష్టమైన రాజకీయ ఎదుగుదల ప్రధాన అంశంగా మారింది. 2025లో మూడు దశల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, మొత్తం 11,491 సర్పంచ్ స్థానాల్లో 4,787 స్థానాలను బీసీ అభ్యర్థులు గెలుచుకున్నారు. మొత్తం పంచాయతీల్లో ఇది దాదాపు 42 శాతం. ఇందులో ఓపెన్ కేటగిరీల్లో గెలిచిన స్థానాలు కూడా ఎక్కువగా ఉండటం, రిజర్వేషన్లకే పరిమితం కాకుండా బీసీలు గ్రామస్థాయిలో బలపడుతున్నారన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది.

కరీంనగర్ జిల్లాలో బీసీలు 50 శాతం కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకోగా, నల్గొండ తదితర జిల్లాల్లో కూడా ఇదే ధోరణి కనిపించింది. రాజకీయ ఉద్రిక్తతల మధ్య కూడా బీసీ కు టుంబాల నుంచి రాజకీయ భాగస్వామ్యం పెరిగినట్టు తెలుస్తోంది. మున్నూరు కాపు, యాదవ్ వంటివాటికి ఉపకులాలుగా విభజితంగా ఉన్న బీసీలు ఇప్పుడు మరింత బలమైన ప్రాతినిధ్యం కోరుకుంటు న్నారు. ఈ పరిస్థితిని గమనించిన ప్రధాన పార్టీలు బీసీలపై ప్రత్యేక దృష్టి పెట్టాయి.

కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ నిర్ణయాలతో ముందుకె ళ్తుండగా, బీఆర్‌ఎస్ అన్నివర్గాలకు చోటు కల్పించే కమిటీలను ఏర్పాటుచేస్తోంది. బీజేపీ కేడర్ స్థాయిలో బీసీలను చురుకుగా సంఘటితం చేసే ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణ రాజకీయాల భవిష్యత్తు దిశను నిర్ణయించడంలో బీసీల పాత్ర మరింత కీలకంగా మారనున్నదని ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది.

రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు..

బీసీల ఐక్యత మొత్తం నాయకత్వంపైనే ఆధారపడి ఉంది. బీజేపీ ఒక బలమైన బీసీ నేతను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే, పార్టీకి ఉన్న జాతీయ స్థాయి బలం కారణంగా బీసీ ఓట్లు ఏకీకృతమయ్యే అవకాశం ఉంది. మరోవైపు, సెప్టెంబర్‌లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్థాపించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ)కి బీసీ యువతలో క్రమంగా ఆదరణ పొందుతోంది. రెడ్డి ఆధిపత్యాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, బీసీలకు ప్రత్యేక రాజకీయ అధికారమే లక్ష్యంగా ఈ పార్టీ ముం దుకు సాగుతోంది.

టీఆర్పీ ఆవిర్భావాన్ని రాజకీయంగా ఒక మలుపుగా పలువురు భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన కార్యకర్తలను ఆకర్షిస్తూ, రెడ్డి రాజకీయాలకు ప్రత్యామ్నాయ వేదికగా మల్లన్న తన పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బీసీలు ఒకే వేదికపై ఐక్యంగా నిలబడకపోతే, వారి ఓట్లు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య చీలిపోయి, మొత్తం ప్రభావం తగ్గిపోవచ్చన్న ఆందోళన ఉంది. 

బీసీలను ఆకర్షించేందుకు పార్టీల పోటీ..

రాజకీయాల్లో ఆయా పార్టీల కూటములు సమీకరణాలను పూర్తిగా మార్చే స్తాయి. బీజేపీ కూటమి కుదిరితే, బీఆర్‌ఎస్‌కు ఉన్న ప్రాంతీయ బలం, బీజేపీకి ఉన్న జాతీయ ప్రభావం కలిసి కాంగ్రెస్‌ను పక్కనపెట్టే అవకాశం ఉంది. అలాంటి కూటమి లేకపోతే, మూడు ప్రధాన పార్టీల మధ్య త్రిముఖ పోటీ జరిగే పరిస్థితి ఉం టుంది. అప్పుడు స్పష్టమైన తీర్పు లేకుండా, ఎన్నికల తర్వాత సంఖ్యాబలం, ధనబలం ఆధారంగా ప్రభుత్వం ఏర్పాటు అయ్యే అవకాశాలు పెరుగుతాయి. 2025లో చూసినట్టే పార్టీల పునరాగమనం ప్రయత్నాలు, పాలనాలోపాలు, ప్రాంతీయ వివాదాల మధ్య అభివృద్ధి, ప్రజా సమస్యలు పక్కకు నెట్టి, కుల రాజకీయాలు ప్రధానంగా మారే ప్రమాదం ఉంది.

మొత్తంగా చూస్తే, బీసీల రాజకీయ ఎదుగుదల తెలంగాణ రాజకీయాల్లో ప్రజా స్వామ్య మార్పునకు సంకేతం. బీసీ కమిషన్ గణాంకాల ప్రకారం రాష్ట్ర జనాభాలో 52 శాతం ఉన్న ఈ వర్గం, 2028-19 ఎన్నికల్లో అధికారాన్ని నిర్ణయించే స్థాయికి చేరుకుంది. అన్ని పార్టీలు ఈ వర్గాన్ని ఆకర్షించేందుకు పోటీపడుతున్నాయి. అయితే అసలైన విజయం కుల రాజకీయాల్లో కాదు.. ఉద్యోగాలు, నీటి హక్కులు, సమాన అభివృద్ధి వంటి ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించడంలోనే ఉంది. 2025 లెక్కల ప్రకారం యువతలో నిరుద్యోగం సుమారు 16 శా తంగా నమోదైందనే విషయాన్ని మరవవద్దు.

హ్యాపీ న్యూ ఇయర్ 

కొత్త సంవత్సరం సమ్మిళిత 

అభివృద్ధిని తీసుకువస్తుందని ఆశిస్తూ..

సి.ఎల్.రాజం

చైర్మన్, విజయక్రాంతి