calender_icon.png 1 January, 2026 | 4:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆచార్యుల్లేని వర్సిటీలు!

01-01-2026 02:19:32 AM

2,816 ప్రొఫెసర్ పోస్టులకు 2,059 ఖాళీనే..

కుంటుపడుతున్న నాణ్యత, పరిశోధన 

దశాబ్దకాలంగా పట్టించుకోని ప్రభుత్వాలు


హైదరాబాద్, డిసెంబర్ 31 (విజయక్రాంతి): గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం యూనివర్సిటీలను నిర్లక్ష్యం చేశాయి. చేస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సరిపడా ఆచార్యుల్లేక (ప్రొఫెసర్లు) యూనివర్సిటీలు కుదేలు అవుతున్నాయి. విశ్వవిద్యాలయాలంటే వీదేశీ విద్యార్థులు సైతం ఇక్కడికి వచ్చి చదువుకునేలా ఉండాల్సిన మన వర్సిటీలు.. స్వదేశంలోని మన విద్యార్థులు కూడా అందులో చేరేందుకు ఆలోచిస్తున్నారంటే విశ్వవిద్యాలయాల పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

విద్యకు కేటాయించే నిధులను ఖర్చుగా చూడొద్దని.. భవిష్యత్‌కు పెట్టుబడిగా చూడాలని చెప్పే ప్రభు త్వం కూడా విద్యాబోధనకు అవసరమైన పోస్టులను భర్తీ చేయకుండా మాటలతోనే సరిపెట్టుకుంటుందనే విమర్శులు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని యూనివర్సి టీల్లో దాదాపు 75 శాతం వరకు పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.

గత 10 నుంచి 12 ఏండ్లగా యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్ చేపట్ట నేలేదు. దీంతో కాంట్రాక్ట్, పార్ట్‌టైమ్, గెస్ట్ ఫ్యాకల్టీలతోనే వర్సిటీలు నడుస్తున్నాయి. దీంతో తెలంగాణ విశ్వవిద్యాలయాలు నాణ్యతలో, రీసెర్చ్‌తో పాటు అనేక అంశా ల్లో అట్టడుగు స్థాయికి వెళ్తున్నాయి. నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్), న్యాక్ అక్రిడిటేషన్‌లోనూ వెనుకబడుతున్నాయి. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో మొత్తం 2,816 ప్రొఫెసర్ పోస్టులకు గానూ 2,059 ఖాళీలు ఉన్నాయి.

పనిచేస్తున్నది కేవలం 755 మంది మాత్రమే. అంటే దాదాపు 75 నుంచి 80 శాతం పోస్టులు ్ల ఖాళీగానే ఉన్న దయనీయ పరిస్థితి. అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్ పోస్టులు ఒక్కో వర్సిటీలో భారీగా ఖాళీగా ఉన్నాయి. మూడు కేటగిరీలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుంది. అయితే క్యారియర్ అడ్వాన్స్‌మెంట్ స్కీం (సీఎస్) కింద ఇంటర్నల్ ఇంటర్వ్యూలు నిర్వహించి నిబంధనల ప్రకారం పీహెచ్‌డీ, పేపర్స్ ఉంటే అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేస్తారు.

అసోసియేట్ ప్రొఫెసర్లకు 15 సంవత్సరాలు అనుభవంతోపాటు ఇద్దరు పీహెచ్‌డీ స్టూడెంట్లు ఉన్నవారికి ప్రొఫెసర్‌గా నియమిస్తారు. అయితే కొంతకాలంగా ఈ విధానం అమలు చేయకుండా కేవలం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు మాత్రమే ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో ఈ పోస్టులను దశాబ్దాకాలంగా భర్తీ చేయకపోవడంతో అసోసియేట్, ప్రొఫెసర్ పోస్టులు కూడా ఖాళీగానే మిగిలిపోయాయి.గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నియామకాలను చేపట్టాలని భావించి దాదాపు 1,060 పోస్టులను భర్తీ చేయాలనుకుంది.

అది ముందుకు సాగలేదు. తర్వాత కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం యూనివర్సిటీల్లోని ఖాళీలపై దృష్టి సారించి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియకు చర్యలు చేపట్టింది. ఈక్రమంలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసేందుకుగానూ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో నూతన మార్గదర్శకాలను జారీచేసింది.

దీంతో వర్సిటీల్లో పనిచేస్తున్న దాదాపు 1,200 మంది కాంట్రాక్ట్, పార్ట్‌టైం ప్రొఫెసర్లు.. తమను రెగ్యులరైజ్ చేశాకే భర్తీ ప్రక్రియను చేపట్టాలని సమ్మె చేపట్టడంతో ప్రభుత్వం 450 పోస్టుల భర్తీకి మాత్రమే అనుమతినిచ్చింది. తమను రెగ్యులరైజ్ చేశాకే పోస్టులను భర్తీ చేయాలని కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ డిమాండ్ చేస్తున్నది.

పోస్టులను భర్తీ చేయాలంటున్న వీసీలు..

రాష్ట్రంలో ఏండ్ల తరబడిగా ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వైస్ ఛాన్సలర్లు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. డిసెంబర్ 29న రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల వీసీలు సమావేశమై పోస్టుల భర్తీకు అనుమతినివ్వాలని ఉన్నత విద్యామండలిని విన్నవించుకున్నారు. రిక్రూట్‌మెంట్ పద్ధతి, రోస్టర్ పాయింట్ల ఖరారు, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీపై ప్రభుత్వం నుంచి స్పష్టత ఇప్పించాలని విద్యామండలి దృష్టికి తెచ్చారు.