calender_icon.png 12 December, 2025 | 5:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంతం

12-12-2025 12:28:59 AM

ప్రశాంతంగా మొదటి విడత పంచాయతీ ఎన్నికలు-జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి 

మొదటి విడత పోలింగ్ 90.08 శాతం నమోదు

రఘునాథపాలెం మండలం వివి పాలెం జెడ్పీహెచ్‌ఎస్, కలెక్టరేట్ లోని వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ సెల్ లలో పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్

ఖమ్మం, డిసెంబర్ 11 (విజయ క్రాంతి): మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఖమ్మం జిల్లాలో 90.08 శాతం నమోదైందని అన్నారు.

ఉదయం 9 గంటల వరకు 23.29 శాతం, 11 గంటల వరకు 52.25 శాతం, 1 గంట వరకు 86.95 శాతం పోలింగ్ నమోదైందని, 1 గంట వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లకు టోకెన్ అందించి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించామని, మొత్తం ఖమ్మం జిల్లాలో 90.08 శాతం పోలింగ్ నమోదైందని అన్నారు.

మొదటి విడత పోలింగ్ జరిగిన బోనకల్ మండలంలో 90.85 శాతం, చింతకాని మండలంలో 91.05 శాతం, కొణిజెర్ల మండలంలో 89.61 శాతం, మధిర మండలంలో 90.08 శాతం, రఘునాథపాలెం మండలంలో 91.09 శాతం, వైరా మండలంలో 90.67 శాతం, ఎర్రుపాలెం మండలంలో 87.28 శాతం పోలింగ్ నమోదైందని కలెక్టర్ పేర్కొన్నారు.

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కలెక్టరెట్ నుంచి నిరంతరం మానిటరింగ్ చేయడం జరిగిందని అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో కౌంటింగ్ ముగిసిన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు.అంతకుముందు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ సందర్భంగా రఘునాథపాలెం మండలం వి. వెంకటాయ పాలెం జెడ్పీహెచ్‌ఎస్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం సందర్శించి, పోలింగ్ సరళిని పరిశీలించారు.

పోలింగ్ అధికారులు ఎన్నికల నియమావళి మేరకు సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలన్నారు. కలెక్టరేట్ లోని వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ సెల్ నుండి సాధారణ పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామా రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ లతో కలిసి పోలింగ్ సరళి పరిశీలించారు.ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.