12-12-2025 12:29:05 AM
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
వెల్దుర్తి, డిసెంబరు 11 : ప్రజా సమస్యలను గాలికొదిలేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండల నాయకులతో కలసి బీఆర్‌ఎస్ బలపరిచిన వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి పాంబండ శేఖర్, ఉప్పు లింగాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి వంచ భూపాల్ రెడ్డి, చేరిలా గ్రామ సర్పంచ్ అభ్యర్థి చల్లపద్మ మహేష్ యాదవ్, వార్డు సభ్యుల గెలుపు కోసం వారి తరఫున మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో ఏ గ్రామానికి వెళ్లినా బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే కనబడుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే బీఆర్‌ఎస్ అభ్యర్థుల విజయాలుగా మారనున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేండ్లు గడుస్తున్నా ఏఒక్క పథకాన్ని సక్రమంగా అమలు చేయలేక పోయిందని విమర్శించారు.
ఎన్నికల్లో వాగ్ధానం చేసిన ఆరు గ్యారంటీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి ఈ సర్పంచ్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కోరారు. బీఆర్‌ఎస్ పార్టీ మద్దతు తెలిపిన సర్పంచ్ అభ్యర్థులకు ఓటేసి బారీ మెజార్జీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు భూపాల్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి రమేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ మోహన్ రెడ్డి, పడిగే నర్సింలు, కృష్ణ గౌడ్, వెన్నవరం శ్రీనివాస్ రెడ్డి, తోట నర్సింలు తదితరులు పాల్గొన్నారు.