05-08-2025 12:00:55 AM
ఫెడరేషన్ నిర్ణయం సమంజసం కాదన్న ఫిల్మ్ ఛాంబర్
నిర్మాతల మండలికి అనుకూలంగా టీఎఫ్‌సీసీ ప్రకటన
యూనియన్లకు అతీతంగా కార్మిలకులతో కలిసి పనిచేసే స్వేచ్ఛ నిర్మాతలకు ఉందని వ్యాఖ్య
ముప్పు శాతం జీతాలు పెంచాలన్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్ నేపథ్యంలో తెలుగు చిత్రపరిశ్రమలో నీలినీడలు అలుముకున్నాయి. కార్మికులెవరూ పనికి హాజరుకాకపోవటంతో షూటింగులన్నీ స్తంభించిపోయాయి. నిర్మాతలంతా ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమాలన్నీ నిలిచిపోతే చాలా నష్టాల పాలవుతామని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపు నేపథ్యంలో ఇండస్ట్రీలో తొలిరోజు బంద్ ప్రభావం స్పష్టంగా కనిపిం చింది. సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ షూటింగ్‌ను ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్మికులు అడ్డుకున్నారు. తాము బంద్‌కు పిలుపునిచ్చినప్పటికీ ముంబయి నుంచి డ్యాన్సర్లను, కార్మికులను తీసుకొచ్చి షూటింగ్ నిర్వహించడమేమిటని ఫెడరేషన్ నాయకులు ప్రశ్నించారు.
కరోనా తర్వాత ధరలన్నీ పెరిగిపోవటంతో జీవితం భారంగా మారిందని, 30 శాతం వేతనాలు పెంచాల్సిందేనని అన్నారు. కార్మికుల బంద్ పిలుపు నేపథ్యంలో ఒక కొత్త సినిమా ప్రారంభోత్సవం, మరో రెండు యాడ్ ఫిల్మ్స్ తప్ప మిగతా సినిమాలేవీ షూటింగ్ జరగలేదు. చిన్న బడ్జెట్ సినిమాల నిర్మాతలు ఇప్పుడు తర్జన భర్జన పడుతున్నారు.
ఫిల్మ్ చాంబర్‌లో నిర్మాతల సమావేశం
ఫెడరేషన్ నిర్ణయం కారణంగా షూటింగులపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో నిర్మాతలంతా సోమవారం ఫిల్మ్ చాంబర్‌కు చేరుకొని ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించేం దుకు చాలా మంది నిర్మాతలు ముందుకు రాలేదు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ యజమాని, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాత్రం తన అభిప్రాయాన్ని మీడియాకు వివరించారు.
ఇతర రంగాల్లో ఉన్న వేతనాల కంటే ఎక్కువే ప్రస్తుతం సినీకార్మికులకు చెల్లిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. కొందరికైతే సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కంటే ఎక్కువగా వేతనాలు ఉన్నాయన్నారు. వేతనాల పెంపు ఎంత శాతం ఉంటుందనే విషయమై చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇంకా తాము తుది నిర్ణయానికి రాలేదని చెప్పారు.
సయోధ్య కుదిరేనా?
కార్మికశాఖ కమిషనర్ గంగాధర్ సమక్షంలో ఫిల్మ్ చాంబర్, నిర్మాతల మండలి, ఎంప్లాయీస్ ఫెడరేషన్ జరపాలనకున్న చర్చలు సోమవారం వర్షం కారణంగా రద్దయ్యాయి. ఈ విషయమై మంగళవారం చర్చలు జరిపే అవకాశం ఉంది. ప్రస్తుతం 5 శాతం పెంచేందుకు సిద్ధం అని చెప్తున్న నిర్మాతలు.. చర్చల అనంతరం సయోధ్య కుదిరితే 10 శాతం కన్నా వేతనాలు పెంచేందుకు ఒప్పుకునే పరిస్థితి కనిపించడం లేదు.
టీఎఫ్‌సీసీ ఏమంటోంది..?
సినీ కార్మికుల వేతన పెంపును నిర్మాతలంతా వ్యతిరేకించారని తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) తెలిపింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. 30 శాతం వేతనం పెంచి ఇచ్చిన నిర్మాతల సినిమాల షూటింగ్స్‌కే వెళ్లేలా ఫెడరేషన్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో టీఎఫ్‌సీసీ ఈ ప్రకటన విడుదల చేయటం చర్చనీయాంశంగా మారింది.
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉందని, ఇలాంటి సమయంలో వేతనాలు పెంచాలనడం భావ్యం కాదని టీఎఫ్‌సీసీ పేర్కొం ది. కార్మికశాఖ కమిషనర్ మార్గదర్శకత్వంలో, సామరస్యపూర్వకంగా పరిష్కారం కోసం చర్చలు జరుగుతున్న సందర్భంలో ఫిల్మ్ ఫెడరేషన్ బంద్ నిర్ణయం తీసుకోవటం సమంజకం కాదని తెలిపింది. లేబర్ కమిషనర్ మాటను ధిక్కరిస్తూ ఫెడరేషన్..
యూనియన్లకు బంద్ పిలుపునివ్వడం బాధాకరమని పేర్కొంది. ఇది నిజాయితీతో కూడిన చర్చల స్ఫూర్తిని దెబ్బ తీసుందని అభిప్రాయ పడింది. వేతనాల పెంపు చిన్న నిర్మాతలకు ఆమోదయోగ్యం కాదని, 30 శాతం పెంపు అంశం వారు భరించే స్థాయిలో లేదని తెలిపింది. అందుకే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నిర్మాతలందరూ ఫెడరేషన్ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొంది.
కనీస వేతన చట్టం ప్రకారం.. ఏ కార్మికుడినైనా నియమించుకునే హక్కు నిర్మాతలకు ఉందని కార్మిక శాఖ కమిషనర్ స్పష్టం చేశారు. అదనంగా, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కూడా నిర్మాతల స్వయంప్రతిపత్తిని సమర్థిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. జీవన వ్యయం విషయంలో మిగతా మెట్రోపాలిటన్ సిటీలతో పోల్చితే హైదరాబాద్‌లో తక్కువ అని పేర్కొన్నారు.
అయినా అన్ని యూనియన్ల వాళ్లకు ఎక్కువ జీతాలు చెల్లిస్తున్నారని వెల్లడించింది. నిర్మాతలు ఇవ్వగలిగే వేతనానికి పని చేయాలనుకున్న వర్కర్స్.. యూనియన్‌లో లేకపోయినా వారితో షూటింగ్ చేసుకోవానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేసింది.
ఎంతోమంది ఔత్సాహిక నిపుణులు, కార్మికులు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ యూని యన్లలో సభ్యత్వం కోసం రూ.లక్షలు డిమాండ్ చేస్తున్నారని తెలిపింది. ప్రాజెక్టు అవసరాలు, వ్యక్తుల సామ ర్థ్యం ఆధారంగా కార్మికులతో కలిసి పనిచేసే స్వేచ్ఛ నిర్మాతలకూ ఉంటుందని స్పష్టం చేసింది.