calender_icon.png 22 December, 2025 | 4:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహనీయుల స్ఫూర్తిని మనమంతా ఆదర్శంగా తీసుకోవాలి

22-12-2025 02:46:13 PM

కేంద్ర మాజీ మంత్రి వెంకట స్వామి (కాక) వర్ధంతి లో జిల్లా అదనపు కలెక్టర్ వేణు 

పెద్దపల్లి,(విజయక్రాంతి): మహనీయుల స్ఫూర్తిని మనమంతా ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణు అన్నారు. సోమవారం అదనపు కలెక్టర్  సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకట స్వామి (కాక) వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా అదనపు కలెక్టర్  మాట్లాడుతూ   మారు మూల ప్రాంతంలో జన్మించినప్పటికీ  జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగిన మహనీయులు వెంకట స్వామి (కాక) కేంద్ర మంత్రిగా, వివిధ పదవులు చేపట్టి,  ప్రజలకు సేవ చేశారని, అటువంటి మహనీయులు మన ప్రాంతంలో జన్మించడం మనందరికీ గర్వ కారణమన్నారు.

వెంకట స్వామి అందించిన స్ఫూర్తితో మనందరం పని చేయాలని, విధులు నిర్వహించే సమయంలో అట్టడుగు వర్గాల వారికి మన వంతు సహకారం అందేలా చూడాలని అదనపు కలెక్టర్ సూచించారు. మన ప్రాంతంలోని పేదలకు వెంకటస్వామి అనేక సేవలు అందించారని,  ప్రభుత్వ భూములను పేదలకు పంపిణీ చేయడంలో కీలకపాత్ర పోషించారని, కేంద్ర, రాష్ట్ర స్థాయి ప్రభుత్వాలలో కీలక పాత్ర పోషించి, పేదల అభ్యున్నతి కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం నిరంతరం తపించి పని చేశారని, తెలంగాణ సమాజం పడే బాధలను అర్థం చేసుకున్నారని, ప్రజల కష్టాల నివారణకు కృషి చేశారన్నారు.  కోల్ బెల్ట్ ఏరియాలో కార్మికుల గుండెల్లో చిరస్థాయి స్థానం పొందారని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి బి. ప్రకాష్, జిల్లా క్రీడల అధికారి సురేష్ , జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య,జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.