04-08-2025 12:08:34 AM
చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లలో సంయుక్త ఒకరు. బింబిసార, సార్, విరూపాక్ష వంటి సినిమాల్లో తన నటనతో మెప్పించి, ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుందీ అమ్మడు. అభిమానులే కాదు.. మేకర్స్ కూడా ఈ ముద్దుగుమ్మ ప్రతిభకు ఫిదా అవుతున్నట్టున్నారు. ఇందుకు ఈ బ్యూటీ అందుకుంటున్న వరుస ఆఫర్లే నిదర్శనం.
సంయుక్త ఇప్పటికే ‘స్వయంభూ’, ‘శర్వా37’, ‘అఖండ2’ల్లో నటిస్తోంది. మలయాళం, హిందీ ప్రాజెక్టులూ ఈమె ఖాతాలో ఉన్నాయి. ఇవన్నీ ఉండగానే మరో బంపర్ ఆఫర్ అందుకుందన్న టాక్ వినవస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 157 చిత్రం కోసం పనిచేస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తోందట చిత్రబృందం.
ఇందులో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉంది. అయితే, ఈ సినిమాలో కథానాయికగా ఇప్పటికే నయనతారను మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో మరో హీరోయిన్‌కు అవకాశం ఉందన్న సంగతి చాలా రోజులుగా వినవస్తోంది. ఆ స్థానంలో సంయుక్త పేరు ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. ఈ విషయమై అధికారిక ప్రకటన రావడమే తరువాయి.