14-10-2025 01:10:55 AM
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 13, (విజయక్రాంతి): రూ.2.50 కోట్ల విలువైన గంజాయిని కంటైనర్‌లో రాజస్థాన్ తరలిస్తుండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం వేపల గడ్డ అన్నపూర్ణ బేకరీ వద్ద సోమవారం సీసీఎస్ పోలీసులు, సుజాతనగర్ ఎస్‌ఐ సంయుక్తంగా పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. కంటైనర్‌ను, రెండు కీప్యాడ్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన జగదీష్ దయారామ్ పాటిల్, అమిత్ రోహిదాస్, కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాకు చెందిన సంజు కుమార్ అలియాస్ సంజు అలియాస్ సంజీవులు, ఒడిశా రాష్ట్రానికి చెందిన హరి ముఠాగా ఏర్పడ్డారు. జగదీష్ దయారామ్ పాటిల్, అమిత్ రోహిదాస్ కలిసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లిపాక సమీపంలోని అటవీ ప్రాంతంలో హరి నుంచి గంజాయిని కొనుగోలు చేసి, సంజు కుమార్ సొంత కంటైనర్‌లో రాజస్థాన్‌కు తరలిస్తుంటారు.
ఈ క్రమంలో 499 కిలోల గంజాయిని తరలించడానికి కంటైనర్ ఓనర్, డ్రైవర్ అయిన సంజు కుమార్ రోహిదాస్ పాటిల్‌తో రూ.4.50 లక్షలకు ఒప్పందం చేసుకుని, అడ్వాన్స్‌గా రూ1.50లక్షలు తీసుకున్నాడు. భద్రాచలం నుంచి కొత్తగూడెం మీదుగా రాజస్థాన్‌లోని జైపూర్‌కు గంజాయిని తరలిస్తుండగా పక్కా సమాచారంతో సోమవారం వేపల గడ్డ వద్ద ఉదయం 8గంటలకు కంటైనర్‌ను పట్టుకున్నారు.
అందులో 499 కేజీలు గల 96 ప్రభుత్వ నిషేధిత గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని, దీన్ని విలువ సుమారు రూ 2.50 కోట్లు ఉంటుందని తెలిపారు. రెండు కీప్యాడ్ ఫోన్లను, గంజాయిని, కంటైనర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
జగదీష్ దయారామ్ పాటిల్‌ను, సంజు కుమార్‌ను అరెస్టు చేశామని మరో ఇద్దరు అమిత్ రోహిదాస్ పాటిల్, హరి పరారీలో ఉన్నారని, ఈ మేరకు కేసులు నమోదు చేశామని, కొత్తగూడెం డీఎస్పీ రహమాన్ పర్యవేక్షణలో, సీఐ ఆర్.వెంకటేశ్వర్లు పర్యవేక్షిస్తున్నారని ఎస్పీ పేర్కొన్నారు. గంజాయిని పట్టుకున్న సీసీఎస్ సీఐ రమాకాంత్, ఎస్సైలు ప్రవీణ్, రామారావు, సిబ్బంది, సుజాతనగర్ ఎస్సై రమాదేవిని ఎస్పీ అభినందించారు.