01-05-2025 12:50:28 AM
హైదరాబాద్, ఏప్రిల్ 30: భూదాన్ భూములను నిషేధిత జాబితాలో ఉంచాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ భూముల వ్యవహారంలో సింగిల్ బెంచ్ తీర్పుపై పలువురు ఐపీఎస్‌లు పిటిషన్ దాఖలు చేయగా..సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని డివిజన్ బెంచ్ బుధవారం విచారణ ముగించింది.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని సర్వే నంబర్ 194లో పలువురు ఐపీఎస్ అధికారులు భూములు కొనుగోలు చేశారు. ఇవి భూదాన్ భూములని, కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ఇటీవల ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై ఈనెల 24న విచారణ చేపట్టిన న్యాయస్థానం..
27 మం ది అధికారులకు చెందిన భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని ఆదేశించింది. అవి భూదాన్ భూములే అని పేర్కొంది. ఈమేరకు జస్టిస్ భాస్కర్‌రెడ్డి సింగిల్ బెంచ్ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తాజాగా కొందరు ఐపీఎస్ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. వీరిలో రవిగుప్తా, మహేశ్ భగవత్, శిఖా గోయల్, తరుణ్ జోషి, రాహుల్ హెగ్డె, స్వాతి లక్రా, సౌమ్య మిశ్రా ఉన్నారు.
ఆ భూములు భూదాన్‌వి కావని, పట్టా భూములేనంటూ ఆ ఐపీఎస్ అధికారులు కోర్టుకు నివేదించారు. సర్వే నం బర్ 194లో 16,20,18 గుంటల విస్తీర్ణాలతో కొనుగోలు చేశామన్నారు. దీనికి సంబంధించిన ఒప్పంద పత్రాలు కూడా ఉన్నా యని తెలిపారు. ఈక్రమంలో విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్..సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేయడానికి నిరాకరించింది.