11-06-2024 12:00:00 AM
గడప రఘుపతిరావు :
‘నేటి బాలలే రేపటి పౌరులు’ అనే నానుడిని నిజం చేస్తూ, ఉత్తమ బాలలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతామని అనుకున్న సందర్భంలో ఆ చిన్నారులను బాల కార్మికులుగా మార్చడం విచారకరం. బాలకార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలలో అవగాహన తీసుకు రావడానికి ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ‘జూన్ 12’ను ‘అంతర్జాతీయ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినం’గా జరుపుకుంటున్నాం. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ‘ఐక్యరాజ్యసమితి’ ప్రత్యేక విభాగమైన ‘అంతర్జాతీయ కార్మిక సంస్థ’ (ఐఎల్‌ఓ) 2002లో ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ప్రారంభించింది.
ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే బాల్యం అనేది బతకడానికి కష్టపడుతున్న ఒక జీవితంగా మారింది. ఆనందంగా ఉండాల్సిన బాల్యం బంధించబడి,బానిసలుగా మార్చబడి మధుర స్మృతులను కోల్పోయి జీవిస్తుండడానికి కారణాలు ఎన్నో. బానిసలుగా బతకవలసి రావడం కంటే దురదృష్టం మరోటి ఉండదు. ఆనందంగా గడప వలసిన బాల్యం రకరకాల కారణాలతో బందీఖానలో బతుకీడుస్తున్న సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషం ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి.
ఆర్థిక కారణాలే అధికం
‘అంతర్జాతీయ కార్మిక సంస్థ’ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 48 మిలియన్లకు పైగా అభాగ్య ప్రజలు, 150 మిలియన్ల బాలకార్మికులు బానిసత్వంలో మగ్గుతున్నారని 2022లో జరిగిన సర్వేలో తేలింది. వీరిలో దాదాపు 25 మిలియన్లు శ్రమ దోపిడీకి, 16 మిలియన్లు బలవంతపు వివాహాలు, 5 మిలియన్లు లైంగిక వేధింపులకు గురై శ్రమ దోపిడీకి గురవుతూ కష్టాలు అనుభ విస్తున్నారు. అన్ని వయస్సుల బాల కార్మికులకు నాణ్యతతో కూడిన ఉచిత విద్యను అందించడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలకార్మికులను గుర్తించి, వారికి అన్ని వసతులను కల్పించి, సంపూర్ణ బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడం, బాలకార్మిక వ్యవస్థకు అసలు కారణం గుర్తించడం వంటివి చేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
పతనమైన ఆర్థిక వ్యవస్థ మరింతమంది చిన్నారులను బాలకార్మికులుగా మార్చే అవకాశం ఉందని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) ప్రకటించింది. అంటే మనం తక్షణ చర్యలు చేపట్టకుంటే చిన్నారుల బాల్యం పనుల్లో గడిచిపోయే పరిస్థితి ఉంది. బాల కార్మిక చట్టాలు ఎంతబలంగా ఉన్నా ఆర్థిక ఇబ్బందులవల్ల పిల్లలనుంచి బాల్యాన్ని, వారి గౌరవాన్ని, వారి శ్రమను దోచుకోకుండా ఉండేలా లేదు. దీనివల్ల పిల్లల శారీరక, మానసిక స్థితి నష్టపోయి అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది. పిల్లలను పనుల్లో పెట్టకుండా అడ్డుకునే నిబంధనలు, చట్టాలు చాలా దేశాల్లో ఉన్నప్పటికీ అమలు పరచడంలో విఫలం అవుతున్నాయి.
ఇప్పటి వరకు ఎంతో కొంత కట్టడి అనేది ఉండేది. కానీ, ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో బాలకార్మికులు పెరిగే అవకాశం ఉందని ఒక సర్వే తేల్చింది. చాలా కుటుంబాలు పేదరికంలో పడటంతో బడి మానేసే పిల్లల సంఖ్య పెరుగుతుంది. బడి మానేసిన పిల్లలందరూ బాలకార్మికులుగా మారే అవకాశం ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగించే విషయం. ప్రస్తుతం 5 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న పదిహేను కోట్లమంది పిల్లలు బాల కార్మికులుగా ఉన్నట్లు తెలుస్తున్నది. వీరిలో ఎక్కువమంది అనారోగ్యకరమైన పరిస్థితుల్లో, ప్రమాదకర పనులు చేస్తున్నారు. బాల కార్మికుల్లో ఎక్కువమంది కుటుంబ వృత్తులు, వ్యాపారాల్లోనే ఎలాంటి జీతం లేకుండా పని చేస్తున్నారు.
వేతనాలు లేకుండా వెట్టిచాకిరి
2025 నాటికి ‘బాల కార్మిక వ్యవస్థ’ను పూర్తిగా నిర్మూలించాలని సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లోనూ నిర్దేశించుకొని,ఆ దిశగా ప్రపంచ దేశాలు కృషి చేస్తున్నాయని బాలల హక్కులను పర్యవేక్షిస్తున్న సంస్థలు చెబుతున్నాయి. చాలామంది బాలకార్మికులు జీతం లేని పనులు చేస్తున్నారని ‘అంతర్జాతీయ కార్మిక సంస్థ’ అధ్యయనంలో బయటపడింది. కరోనా వైరస్‌వల్ల ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితం అవుతున్న కుటుంబాలపై ఆర్థికంగా చాలా ఒత్తిడి ఉండడం వల్ల తమ పిల్లలను గత్యంతరం లేక బాలకార్మికులుగా మార్చుతున్నారు.
ఒక వ్యక్తి భయం, హింస, బలవంతం, మోసం, బెదిరింపులు, అధికార దుర్వినియోగం లాంటి కారణాలకు లొంగి, మనిషిగా వారి శ్రమను గుర్తించక, వారి శ్రమను దోచుకోవడమే బానిసత్వంగా భావించాలి. విశ్వవ్యాప్తంగా పరిశీలిస్తే ఇలా బానిసత్వంలో బలవంతపు శ్రమ దోపిడి, వెట్టి చాకిరి, లైంగిక వేధింపులు లాంటివి ఎక్కువ దేశాల్లో కనిపిస్తాయి. మరికొన్ని దేశాల్లో పరిశీలిస్తే పిల్లలను బలవంతంగా సాయుధ పోరుకు వాడడం, మహిళలను అమ్ముకోవడం, బలవంతపు వివాహాలు, మానవ అక్రమ రవాణా లాంటివి సైతం కనిపిస్తాయి.
ఆర్థిక పరిస్ఠితి బాగాలేక, కనీసం తినడానికి సరైన ఆహారం లేక గత్యంతరం లేని పరిస్థితి కొందరిది. బలవంతపు బతుకులు మరికొందరివి. ప్రతి 1000 మందిలో 5.4 మంది, నలుగురు బాలబాలికల్లో ఒక్కరు బానిసత్వంలో బతుకుతున్నారని, బడుగు, బలహీన బాలికలు, మహిళల్లో అధికులు పడుపు వృత్తిలోకి బలవంతంగా లాగబడి, మరొక దారిలేక ఆ వృత్తిలో అయిష్టంగా కొనసాగుతున్నారని ఒకానొక సర్వేలో వెల్లడయ్యాయి.
ప్రత్యేక ప్రణాళికలు ఏర్పరచుకుంటే తప్ప లక్ష్యాన్ని చేరుకోలేం. 2000 నుంచి 2016 మధ్య ప్రపంచవ్యాప్తంగా బాల కార్మికుల సంఖ్య 38 శాతం వరకు తగ్గింది. అంటే, పనిచేస్తున్న పిల్లల సంఖ్య 9.4 కోట్లమంది వరకూ తగ్గింది. ఇదే క్రమంలో చర్యలు తీసుకోవడం వల్ల మరో ఐదేండ్లలో బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించుకోవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల మంది
కుటుంబాలకు ఆసరాగా నిలవడం, చిన్నారులు ఏం చేస్తున్నారో ఎప్పటికప్పుడు సర్వేల ద్వారా పరిశీలించడం, ప్రతి గ్రామంలో, పట్టణంలో ప్రతి వీధిలో బాలల జాబితాను ప్రదర్శిస్తూ వారు ఎక్కడ ఉన్నారో గుర్తించడం, బడీడు పిల్లలు తప్పకుండా స్కూళ్లలో ఉండేలా చూడడం, ఎవరు కూడా పిల్లలను పనిలోకి తీసుకోకుండా అవగాహన కల్పించడం, వారు ఇష్టపడే పరిసరాలను తయారు చేయడం లాంటి వాటిపై శ్రద్ద పెట్టడం వల్ల బాల కార్మికులుగా మారే అవకాశాన్ని తగ్గించవచ్చు.
ప్రస్తుతం మొత్తం మీద సుమారు 15 కోట్లమంది పిల్లలను బాలకార్మిక వ్యవస్థ పీడిస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. చాలా దేశాల్లో బాలకార్మిక వ్యవస్థ ఉండడానికి ముఖ్యకారణం పేదరికమే. ఈ విషయం జాతీయ, అంతర్జాతీయ సంస్థలు కూడా సర్వేలద్వారా తేల్చాయి. పేదరికం పిల్లలకు శాపంగా మారి, వారు చదువుకోవాల్సిన వయసులో వ్యవసాయంలోనూ, దుకాణాలలో, కర్మాగారాల్లో, ఇతరత్రా పనుల్లో తల్లిదండ్రులకు సాయంగా లేదా కూలీలకో వెళుతున్నారు.
పెద్దలే నడుం బిగించాలి
తల్లిదండ్రుల అవగాహనా రాహిత్యం లేదా పేదరికం వారినిలా చేస్తున్నది. కొంతమంది తల్లిదండ్రులు తాత్కాలిక సంపాదనను ఆశించి పిల్లలను బాల కార్మికులుగా మారుస్తున్నారు. భారతదేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం మీద బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఎన్నో చట్టాలున్నాయి. అయినా, ఇప్పటికీ బాల కార్మికులను మనం పూర్తిగా తొలగించలేకపోతున్నాం. 167 దేశాల్లో భారతదేశం 53వ స్థానంలో ఉన్నప్పటికీ అధిక (19 మిలియన్లు) గల దేశంగా ఇండియా అగ్రభాగాన ఉన్నది.
ఎన్ని ప్రత్యామ్నాయ మార్గాలు చూపినా, ఆర్థికాభివృద్ధి కల్పించినా బానిసత్వాన్ని అనుకున్న స్థాయిలో తగ్గించలేక పోతున్నాం. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నడుం కట్టాలి. ఎదుటి వారికీ అవగాహన కల్పిస్తూ, సమాజంలో మార్పు తెచ్చేలా అందరూ కృషి చేయవలసి ఉంది. పెద్దల్లో అవగాహన, పిల్లల్లో ఆలోచన కలుగ చేస్తే తక్కువ కాలంలోనే బాల్యాన్ని భద్రంగా బందీఖాన నుండి బయటకు తీసుకు రావచ్చు. ప్రస్తుత కొత్త ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహిస్తాయని కోరుకుందాం.
వ్యాసకర్త సెల్: 9963499282