06-12-2024 01:42:56 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 5 (విజయక్రాంతి)/ముషీరాబాద్: హైదరాబాద్ నగర పరిధిలోని సంధ్య థియేటర్ వద్ద బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిపై ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సినీ స్టార్ అల్లు అర్జున్‌తో పాటు ఆయన టీం, థియేటర్ యాజమాన్యంపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోందైంది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. పుష్ప అభిమానులతో కలిసి అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చారు.
అల్లు అర్జున్ టీం నుంచి కానీ, సంధ్య థియేటర్ యాజమాన్యం నుంచి గానీ పోలీసులకు ఈ సమాచారం తెలుపలేదు. అల్లు అర్జున్ థియేటర్‌కు వస్తున్నారని తెలిసి అభిమానులు భారీగా తరలివచ్చారు. థియేటర్ యాజమాన్యం ఎలాంటి ప్రైవేటు సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసుకోలేదు. నటీనటుల బృందానికి ప్రత్యేక ఎంట్రీ, ఎగ్జిట్‌లను ఏర్పాటు చేయలేదు. ఆయన్ను చూసేందుకు అభిమానులు ఎగబడడంతో తొక్కిసలాట జరిగింది.
తొక్కిసలాటలో రేవతి(35) తో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ్ కిందపడిపోయారు. వారిని తొక్కుకుంటూ ఎంతోమంది వెళ్లారు. దీంతో ఇద్దరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పోలీసులు ఆమె ను వెంటనే దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందిందని వైద్యులు తెలిపారు. పోలీసులు శ్రీతేజ్ కు సీపీఆర్ చేసి అదే ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్‌తో పాటు ఆయన టీం, థియేటర్ యాజమాన్యంపై సెక్షన్ 105, 118(1) రెడ్‌విత్ 3(5) బీఎన్‌ఎస్ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు.