calender_icon.png 10 July, 2025 | 8:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రాహ్మణవెల్లంలతో లక్ష ఎకరాలకు నీరు

06-12-2024 01:43:32 AM

*మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 

* రేపు సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాట్ల పరిశీలన

నల్లగొండ, డిసెంబర్ 5 (విజయక్రాంతి): బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టుతో లక్ష ఎకరాలకు సాగునీరు, వందలాది ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు తాగునీరు అందనుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లాకు శనివారం సీఎం రేవంత్‌రెడ్డి రానున్న నేపథ్యంలో నార్కట్‌పల్లి మండలంలోని బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు, నల్లగొండ మెడికల్ కళాశాల భవనం వద్ద కలెక్టర్‌తోపాటు ఉన్నతాధికారులతో కలిసి బుధవారం మంత్రి కోమటిరెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు.

అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. రూ.వెయ్యి కోట్లతో పూర్తి చేసిన బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టును సీఎం ప్రారంభిస్తారని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో 2008లోనే 80 శాతం పనులు పూర్తయిన ఈ ప్రాజెక్టును గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆలస్యమైందని పేర్కొన్నారు. ఎస్సెల్బీసీ పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.4,540 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నల్లగొండ జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరందుతుందని, శ్రీశైలం డెడ్ స్టోరేజీకి చేరినా సాగు, తాగునీరుకు ఢోకా ఉండదన్నారు.

రూ. పది కోట్లతో ఎల్లారెడ్డిగూడెం వద్ద పర్యాటకశాఖ హరిత హోటల్ నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందని చెప్పారు. నార్కెట్‌పల్లి, దామరచర్ల మండలాలకు జూనియర్ కళాశాలలు మంజూరు చేస్తూ ఈ నెల 9న ప్రభుత్వం జీవో విడుదల చేయనుందని స్పష్టం చేశారు. దామరచర్ల మండలంలో యాదాద్రి పవర్ ప్లాంట్ యూనిట్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని, అనంతరం నల్లగొండలో గంధవారిగూడెం వద్ద రూ.40 కోట్లతో నిర్మించనున్న నర్సింగ్ కళాశాలకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. నల్లగొండలో మహిళ నైపుణ్యాభివృద్ధి కేంద్రం, గ్రంథాలయ భవనం, కనగల్, తిప్పర్తి మండలాల జూనియర్ కళాశాలకు శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు.

సాయంత్రం ఎస్సెల్బీసీ సమీపంలోని రాజీవ్‌గాంధీ ప్రాంగణంలో లక్షమందితో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారని వెల్లడించారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, నల్లగొండ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్  కలెక్టర్ నారాయణ్ అమిత్, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, అదనపు ఎస్పీ రాములునాయక్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీవాణి, జిల్లా వైద్యాధికారి శ్రీనివాస్, ఆర్డీవో అశోక్‌రెడ్డి, డీఎస్పీ శివరాంరెడ్డి ఉన్నారు.