కేయూలో క్యాష్ కాపీయింగ్!
ఒక్కో పేపర్‌కు రూ.5 వేలు వసూలు
కాంట్రాక్ట్ సిబ్బంది కాసుల కక్కుర్తి
పలు ప్రైవేటు కాలేజీలతో కుమ్మక్కు
ఆన్సర్ షీట్లతో అడ్డగోలు వ్యాపారం
కేయూ డిగ్రీ పరీక్షల సెక్షన్‌లో దారుణం
సీసీ కెమెరాలతో బయటపడ్డ నిర్వాకం
పోలీసుల అదుపులో ముగ్గురు సిబ్బంది
హనుమకొండ, మే 31(విజయక్రాంతి) : కాకతీయ యూనివర్సిటీ(కేయూ)లో మరో దారుణం వెలుగుచూసింది. డిగ్రీ పాసయ్యేందుకు కొందరు విద్యార్థులు అడ్డదారులు తొక్కారు. తాత్కాలిక సిబ్బందితో చేతులు కలిపి ఏకంగా ఆన్సర్ షీట్లతో అవకతవకలకు తెరతీశారు. ఈ వ్యవహారం కాస్తా సీసీ కెమెరాలో రికార్డు అవడంతో అడ్డంగా బుక్కయ్యారు. కొందరు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు, కేయూ తాత్కాలిక సిబ్బందితో కుమ్మక్కై ఈ బాగోతానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై యూనివర్సిటీ అధికారులు ఫిర్యాదుతో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. ఈ విషయం ఇప్పుడు వర్సిటీల వ్యాప్తంగా సంచలనానికి దారితీసింది.
అసలు కథ..?
కేయూ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బీఏ, బీకాం, బీఎస్సీ , బీబీఏ డిగ్రీ పరీక్షలు గత నెల 6 నుంచి జరుగుతున్నాయి. పరీక్ష కేంద్రాల నుంచి వచ్చే జవాబు పత్రాలను కేయూ పరీక్షల విభాగంలోని గదుల్లో భద్రపరుస్తున్నారు. ఈ సెక్షన్‌లో సుమారు 20 మంది వరకు దినసరి వేతనంపై పనిచేస్తున్నారు. వీరిలో ముగ్గురు పలు కళాశాలల విద్యార్థులతో కుమ్మక్కైనట్లు తెలిసింది. విద్యార్థులు కోరిన హాల్‌టికెట్ నంబర్లు గల ఆన్సర్‌షీట్లను వారికి ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకు ఒక్కో పేపర్‌కు రూ.5వేలు ఇచ్చేలా ఇరు వర్గాల మధ్య అంగీకారం కుదిరింది. ఈ మేరకు ఆ ముగ్గురు విద్యార్థులు సూచించిన హాల్‌టికెట్ నంబర్ల ఆన్సర్ షీట్లను రోజువారీగా బండిల్ కట్టడానికి ముందుకు విద్యార్థులకు అందజేసేవారు. ఖాళీ పేపర్లను ఆన్సర్లతో నింపి తిరిగి సిబ్బందికి అందజేసేవారు. ఇలా ఈ వ్యవహారమంతా సీసీ కెమెరాల్లో రికార్డయింది. దీంతో ఈ క్యాష్ కాపీయింగ్ అంతా బట్టబయలైంది.
పోలీసుల అదుపులో నిందితులు!
యూనివర్సిటీలోని పరీక్షల విభాగంలో చోటుచేసుకున్న ఘటనతో అధికారులు అలర్ట్ అయ్యారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను పరిశీలించిన పరీక్షల నియంత్రణాధికారి నర్సింహాచారి రిజిస్ట్రార్ మల్లారెడ్డి దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో రిజిస్ట్రార్ యూనివర్సిటీ పోలీసులకు సమాచారం ఇచ్చి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ముగ్గురు సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. వారి సెల్‌ఫోన్లను సైతం సీజ్ చేసినట్లు తెలిసింది. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వల్లే పునరావృతం అవుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
ఒక్కో పేపర్‌కు రూ. 5 వేలు
యూనివర్శిటీలో చోటుచేసుకున్న బాగోతం వెనక ఓ టీం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. యూనివర్శిటీ బయట ఉన్న వ్యక్తులు కొంతకాలంగా పరీక్ష పత్రాల మార్పిడి తతంగాన్ని నడుపుతున్నట్లు సమాచారం. పరీక్షల విభాగంలో నుంచి ఒక ఆన్సర్‌షీట్‌ను బయటకు తీసుకువచ్చి జవాబులు రాయించి మళ్లీ తీసుకెళ్లి బండిల్స్ పెడితే రూ. 5 వేల తీసుకుంటున్నట్లు తెలిసింది. బయట ఉండి ఈ తతంగం నడిపిస్తున్న వ్యక్తులతో సంబంధం ఉన్న వాళ్లే దినసరి వేతన సిబ్బందిగా పనిచేస్తుండటంతో వారి వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
బండిల్స్‌లో నుంచి ఆన్సర్‌షీట్స్‌ను బయటకు తీసేటప్పుడు ఒకరు సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డు కాకుండా అడ్డంగా కూర్చుంటున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో అనుమానించిన అధికారులు సీసీ పుటేజీలను నిశితంగా పరిశీలించడంతో అక్రమ బాగోతం బయటపడింది. కొంతకాలం కిందట క్యాంపస్‌లోని ఇంజినీరింగ్ కళాశాలలో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగి దూరవిద్య బీఎల్‌ఎస్సీ కోర్టులో పరీక్షలు రాశాడు.
పరీక్షలు విభాగంలో పనిచేసే ఇద్దరు తాత్కాలిక ఉద్యోగులతో తాను రాసిన జవాబు పత్రాలను బయటకు తెప్పించుకుని మళ్లీ రాసి అందులోనే పెట్టించాడు. ఈ వ్యవహారాన్ని కనిపెట్టిన అప్పటి పరీక్షల నియంత్రణాధికారి మల్లారెడ్డి వారిని విధుల నుంచి తొలగించారు. ఆ రెగ్యులర్ ఉద్యోగికి మాత్రం కేవలం ఇంక్రిమెంట్ కట్ చేసి వదిలేశారు. అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే ఈ దందాకు తెరపడేదని యూనివర్సిటీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.






