రైతుపక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం
రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్‌రెడ్డి
ఆదిలాబాద్, మే 31 విజయక్రాంతి: రైతుపక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వమని, రైతులను అన్నివిధాలా ఆదుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషి చేస్తున్నారని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్‌రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో మూడురోజులుగా రైతులు పత్తి విత్తనాలు తీసుకునేం దుకు ఇబ్బంది పడుతున్నారని మీడియాలో విస్తృతమైన కథనాలు ప్రసారమైన నేపథ్యంలో శుక్రవారం ఆయన ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో పర్యటించారు. ఫెర్టిలైజర్ షాపుల వద్దకు వెళ్లి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. దుకాణాల యజమానులకు పలు అంశాలపై సూచనలిచ్చారు. అనంతరం కలెక్టర్ రాజర్షి షాను కలిసి పలు అంశాలపై చర్చించారు.
తర్వాత అన్వేష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో రాశి 659 పత్తి విత్తనాలకు డిమాండ్ ఉందని, రైతుల అవసరాల మేరకు విత్తనాలను అందుబాటులో ఉంచామన్నారు. బ్లాక్ మార్కెట్‌లో విత్తనాలు విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కృత్రిమ కొరత సృష్టించేందుకు యత్నించినా సహించబోమన్నారు. అవసరమైతే పీడీ యాక్ట్‌లు నమోదు చేయడానికీ వెనుకాడమని హెచ్చరించారు. రైతులపై లాఠీఛార్జ్ జరిగిందంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, జోగు రామన్న అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పర్యటనలో కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ రాష్ట్ర కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మల్లేష్, నాయకులు సంతోష్, చరణ్ గౌడ్, సామ రూపేష్ రెడ్డి, కొండా గంగాధర్ ఉన్నారు.






