15-10-2025 07:58:50 PM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లాలోని మారుమూల గ్రామాలలో సెల్ సిగ్నల్ సేవలను విస్తరించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో భారత్ సంచార నిగం లిమిటెడ్, జియో, ఎయిర్ టెల్ సంస్థల ప్రతినిధులతో సెల్ టవర్ల ఏర్పాటు, సిగ్నల్స్ విస్తరణపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి మారుమూల ప్రాంతాలకు సిగ్నల్స్ అందే విధంగా సేవలను విస్తరించాలని, చాలా గ్రామాలలో పూర్తి స్థాయిలో సేవలు అందడం లేదని తెలుపుతూ ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తులు వస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు, చేయూత పింఛన్ల, సన్న బియ్యం కార్యక్రమాలు సిగ్నల్స్ తో ముడిపడి ఉన్నాయని, పూర్తి స్థాయిలో సేవలు అందించేందుకు సిగ్నల్స్ సామర్థ్యాన్ని మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రేట్ పర్యవేక్షకులు శశిధర్, బిఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.