కంటితుడుపుగా జనగణన అవగాహన ర్యాలీ!
- ఏర్పాట్లలో ప్రణాళిక శాఖ అధికారులు విఫలం
- టెంట్, మైక్ సెట్, తాగునీరు ఏర్పాట్లలో అలసత్వం
నాగర్‌కర్నూల్, మే 8 (విజయక్రాంతి): జనగణనపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని జడ్పీ మైదానంలో నిర్వహించిన అవగాహన ర్యాలీ కంటితుడుపుగా సాదా సీదాగా సాగింది. పాఠశాల క్రీడా మైదానం నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ప్రధాన రహదారి మీదుగా సాగింది. జిల్లా ముఖ్య ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు హాజరైనా, కనీస సౌకర్యాల కల్పనలో అధికారులు విఫలమైనట్లు విమర్శలు వెల్లువెత్తాయి.
ర్యాలీ ప్రారంభ స్థలంలో టెంట్, తాగునీరు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయక పోవడంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. మైక్ సెట్ కూడా సక్రమంగా ఏర్పాటు చేయక పోవడంతో పలువురు అధికారుల ప్రసంగాలు కూడా స్పష్టంగా వినిపించక పోయాయని పాల్గొన్నవారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి ప్లకార్డులు, అవగాహన కరపత్రాలు, బ్యానర్లు కూడా ఒక్కటే ప్రదర్శించడం విశేషం. యాభైకి పైగా టోపీలను మాత్రం పంపిణీ చేసి మమ అనిపించారని విసుక్కున్న పరిస్థితి కనిపించింది.
ఈ కార్యక్రమాన్ని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ అమరేందర్, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అమరేందర్ మాట్లాడుతూ జనగణన దేశ అభివృద్ధికి పునాది వంటిదని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయించాలని, ప్రజలు జనగణన సిబ్బందికి పూర్తి సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సుజాత, డీఈఓ రమేష్ కుమార్, ఇంచార్జి డీఎంహెచ్వో రవి నాయక్, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, రెవెన్యూ అధికారులు, ఆశా వర్కర్లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.






