05-10-2025 08:55:49 PM
చిట్యాల (విజయక్రాంతి): స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలను చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని స్వయం సేవకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొనగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మర్రి ప్రతాప్ రెడ్డి హాజరై ప్రసంగిస్తూ దేశభక్తి, క్రమశిక్షణ, సేవా భావన సంఘం మూలసూత్రాలని ఆయన పేర్కొన్నారు. 1925లో నాగపూర్‌లో డా. కేశవ్ బాలిరాం హెడ్గేవార్ స్థాపించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నేటికి నూటేళ్ల విజయయాత్ర పూర్తి చేసుకుంది. గత శతాబ్దం నుంచి లక్షలాది స్వయంసేవకులను తీర్చిదిద్దిన ఆర్ఎస్ఎస్.. ప్రతిరోజూ జరిగే శాఖల ద్వారా యువతలో దేశసేవా చైతన్యం నింపుతోందన్నారు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, దేశభక్తి పాటలు ఆకట్టుకున్నాయి. "సమాజ సేవే దేశ సేవ" నినాదంతో ముందుకు సాగుతున్న ఆర్ఎస్ఎస్ దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు.